AP CEO: ఎన్నికల కోడ్‌పై ఏపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అవగాహన కార్యక్రమం
- కార్యక్రమంలో పాల్గొన్న వివిధ పార్టీల ప్రతినిధులు
- అభ్యర్థులు తమ వెంట రూ.50 వేలకు మించి తీసుకెళ్లొద్దన్న ఎన్నికల అధికారి ముఖేశ్‌కుమార్ మీనా
- రూ.10 వేల విలువైన వస్తువులను మాత్రమే తరలించేందుకు అనుమతి
- లోక్‌సభ ఎన్నికల్లో రూ.95 లక్షలు, అసెంబ్లీ ఎన్నికల్లో గరిష్ఠంగా రూ.40 లక్షలు ఖర్చు చేసేందుకు అనుమతి
త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసీ తాజా మార్గదర్శకాలపై ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌కుమార్ మీనా అక్కడి రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక పాటించాల్సిన నిబంధనలను వివరించారు.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక అభ్యర్థులు, వారి ఏజెంట్లు, రాజకీయ పార్టీల కార్యకర్తలు తమ వెంట రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లకూడదని ముఖేశ్‌కుమార్ తెలిపారు. రూ.10 వేల కంటే విలువైన వస్తువులను రవాణా చేయడం నిషిద్ధమన్నారు. పార్టీల స్టార్ క్యాంపెయినర్లు రూ.లక్షకు మించి నగదు కలిగి ఉండకూడదన్నారు.
కులం, మతం, భాష ప్రాతిపదికన ఓటర్లను ప్రేరేపించడం, ఓట్లు అడగటం నిషిద్ధమని ఆయన వివరించారు. ‘‘లోక్‌సభ అభ్యర్థులు రూ.95 లక్షల వరకూ, శాసనసభ అభ్యర్థులు రూ.40 లక్షల వరకూ ఖర్చు చేసేందుకు అనుమతి ఉంది. బహిరంగ సభల నిర్వహణ, పోస్టర్లు, బ్యానర్లు, వాహనాల కోసమే ఈ మొత్తాన్ని వెచ్చించాలి. ఓటర్లను ప్రభావితం చేసేలా నగదు, కానుకలు, మద్యం ఇతర వస్తువులు పంపిణీ చేయడాన్ని చట్టవిరుద్ధమైన ఖర్చుగా పరిగణిస్తాం ఎన్నికల ఖర్చుల కోసం అభ్యర్థులు ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా, రోజువారీ ఖర్చుల రిజిస్టర్‌ను నిర్వహించాలి. పార్టీలు, అభ్యర్థులు చేసే వ్యయంపై పూర్తిస్థాయిలో నిఘా ఉంటుంది’’ అని అన్నారు.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని ముఖేశ్‌కుమార్ మీనా అన్నారు. లోక్‌సభ అభ్యర్థులు రూ.25 వేలు, శాసనసభ అభ్యర్థులు రూ.10 వేలు నగదు రూపంలో ఆర్బీఐ లేదా ట్రెజరీ ద్వారా సెక్యూరిటీ డిపాజిట్ కింద చెల్లించాలని అన్నారు. చెక్కులు, బ్యాంకు డ్రాఫ్టులు అనుమతించట్లేదని తెలిపారు. ప్రభుత్వ పనిదినాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ ఆర్వోలు, ఏఆర్వోలు నామినేషన్లు స్వీకరిస్తారని చెప్పారు. నామినేషన్ సందర్భంగా అభ్యర్థితో కలిపి మొత్తం ఐదుగురినే కార్యాలయం లోపలికి అనుమతిస్తామన్నారు. అభ్యర్థులు తమ వాహనాలను 100 మీటర్ల దూరంలోనే నిలిపివేయాలని చెప్పారు.
కాగా, ఎన్నికల విధులకు వాలంటీర్లను వినియోగించుకోవద్దని ఈసీ చెప్పినా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు వారిని వినియోగించుకుంటున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఈసీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశామన్నారు.