Revanth Reddy: ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా వెలువడనున్న వేళ.. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
- కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో పాల్గొననున్న సీఎం
- హాజరుకానున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- నేడు తొలి జాబితా ప్రకటించనున్న వేళ కీలక సమావేశంలో పాల్గొననున్న ముఖ్య నేతలు
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ సంసిద్ధమైంది. నేడు (గురువారం) 150 నుంచి 200 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను ఏఐసీసీ ప్రకటించనుంది. అయితే తొలి జాబితా విడుదలకు ముందు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. గురువారం సాయంత్రం జరగనున్న ఈ సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఏం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
తొలి జాబితాలో తెలంగాణ నుంచి 10 మంది అభ్యర్థులు!
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులతో ఏఐసీసీ నేడు తొలి జాబితా ప్రకటించనుంది. దీంతో ఆశావహుల్లో ఎవరెవరికి టికెట్లు దక్కుతాయి, ఎవరికి మొండి చేయి ఎదురవుతుందనే ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థులపై పార్టీ నాయకత్వం ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చినట్టు తెలుస్తోంది. కాగా తొలి జాబితాలో తెలంగాణ నుంచి 10 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. తెలంగాణ అభ్యర్థుల ఎంపిక బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది. దీంతో ఆయన ఎవరెవరి పేర్లు ప్రతిపాదించారు? తొలి జాబితాలో ఎవరి పేర్లు ఉంటాయి? అనేది ఈ రోజే తేలిపోనుంది.