Medaram Jatara: పూర్తయిన మేడారం హుండీ లెక్కింపు... రూ.13.25 కోట్ల ఆదాయం
- 540 హుండీలను వారం రోజుల పాటు లెక్కించిన అధికారులు
- క్రితంసారి కంటే రూ.1.79 కోట్ల ఆదాయం ఎక్కువ వచ్చినట్లు వెల్లడి
- హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఎనిమిది రోజుల పాటు మేడారం హుండీల లెక్కింపు
మేడారం సమ్మక్క సారక్క జాతర హుండీ లెక్కింపు పూర్తయింది. మొత్తం 540 హుండీలను వారం రోజుల పాటు లెక్కించారు. హుండీల ద్వారా రూ.13.25 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. 2022 మేడారం జాతర కంటే ఈ ఏడాది జాతరకు రూ.1.79 కోట్ల ఆదాయం ఎక్కువగా వచ్చినట్లు తెలిపారు. హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఎనిమిది రోజుల పాటు మేడారం హుండీలను లెక్కించారు.
ఫిబ్రవరి 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు మేడారం జాతర ఘనంగా జరిగింది. జాతర అనంతరం హుండీలను టీటీడీ కళ్యాణ మండపానికి తీసుకువచ్చి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కట్టుదిట్టమైన భద్రత మధ్య లెక్కించారు. నోట్లు, కాయిన్స్ కలిపి మొత్తం 13 కోట్ల 25 లక్షల 22 వేల 511 రూపాయలు వచ్చాయి. 779 గ్రాముల బంగారం, 55 కిలోల వెండి వచ్చింది. ఈ మొత్తాన్ని బ్యాంకులో జమ చేశారు.