Gummanuru Jayaram: చంద్రబాబు ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి చేస్తా: గుమ్మనూరు జయరాం
![TDP Leader Gummanuru Jayaram speech](https://imgd.ap7am.com/thumbnail/cr-20240306tn65e840511e8e6.jpg)
- మంత్రి పదవికి రాజీనామా చేశాకే టీడీపీలో చేరానన్న జయరాం
- చంద్రబాబు ఏ బాధ్యత అప్పగించినా చేస్తానని వెల్లడి
- జయరాం ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన పలువురు వైసీపీ నేతలు
ఆలూరుకు చెందిన గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో బుధవారం పలువురు వైసీపీ నేతలు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా జయరాం మీడియాతో మాట్లాడుతూ, అధినేత చంద్రబాబు తనకు ఏ బాధ్యత అప్పగిస్తే అది చేస్తానన్నారు. మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాతే తాను టీడీపీలో చేరిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇలా పదవి వదులుకున్నాక బర్తరఫ్ చేసినా తనకు అనవసరమని పేర్కొన్నారు.
ఇక చంద్రబాబు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి చేస్తానని చెప్పారు. ఇంతకుముందు ఆలూరుకు సేవలందించానని, ఈసారి గుంతకల్లు నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు తన మనసులోని మాట బయటపెట్టారు. అయితే, ఆ స్థానంపై వేరే వాళ్లు ఆశలు పెట్టుకోవచ్చని, తాను వారందరినీ కలుపుకొని ముందుకు వెళ్తానన్నారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని.. రాష్ట్రానికి మంచి జరగాలని ప్రజలు కోరుకుంటున్నట్లు జయరాం తెలిపారు.