Ponguleti Srinivas Reddy: బీఆర్ఎస్ అభ్యర్థిని శూర్పణకతో పోల్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- మహబూబాబాద్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి, శూర్పణకకు మధ్య పోటీ జరగబోతుందన్న మంత్రి
- బీఆర్ఎస్ హయాంలో బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల ప్రజలు తీవ్రంగా గోసపడ్డారని వ్యాఖ్య
- కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లోనే రెండు గ్యారెంటీలు అమలు చేశామని గుర్తు చేసిన పొంగులేటి
రానున్న లోక్ సభ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి, శూర్పణకకు మధ్య పోటీ జరగబోతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ... మార్పు రావాలి... కేంద్రంలోనూ ఇందిరమ్మ రాజ్యం రావాలని నియోజకవర్గ ప్రజలు బలంగా కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
గత బీఆర్ఎస్ హయాంలో బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల ప్రజలు తీవ్రంగా గోసపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లోనే ఆరు గ్యారెంటీల్లో రెండింటిని అమలు చేశామని, ఇటీవల మరో రెండింటిని ప్రారంభించామని గుర్తు చేశారు. హామీలను ఒక్కటొక్కటిగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. కాగా మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ మరోసారి మాలోత్ కవితకు అవకాశం ఇచ్చింది.