Narendra Modi: బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకే జాతి పక్షులు: పటాన్ చెరులో ప్రధాని మోదీ వ్యాఖ్యలు

PM Modi slams BRS and Congress

  • పటాన్ చెరులో బీజేపీ విజయ సంకల్ప సభ
  • హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ
  • తెలంగాణలో బీజేపీ పట్ల ఆదరణ పెరుగుతోందని వెల్లడి
  • బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఏముందో ప్రజలకు తెలుసని వ్యాఖ్యలు

ప్రధాని నరేంద్ర మోదీ నేడు తెలంగాణలో పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. పటాన్ చెరులో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభకు హాజరయ్యారు. ఈ సభలో మోదీ ప్రసంగిస్తూ... తెలంగాణలో బీజేపీ పట్ల ఆదరణ పెరుగుతోందని వెల్లడించారు. తాము మోదీ కుటుంబ సభ్యులమని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారని వివరించారు. మీ కలలే నా సంకల్పం... అని స్పష్టం చేశారు. 140 కోట్ల మంది భారతీయులే తన కుటుంబం అని ప్రధాని మోదీ తెలిపారు.

మాదిగల అభ్యున్నతికి అన్ని చర్యలు తీసుకున్నామని, మాదిగల సమస్యలను అర్థం చేసుకున్నామని చెప్పారు. 

బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకే జాతి పక్షులని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఏముందో ప్రజలకు తెలుసు అని వ్యాఖ్యానించారు. తెలంగాణ సంక్షేమం కోసం తాము కట్టుబడి ఉన్నామని అన్నారు. మోదీ గ్యారెంటీ అంటే గ్యారెంటీగా జరిగి తీరుతుందని అన్నారు. మోదీ ఏదైతే చెబుతాడో అదే చేసి చూపిస్తాడని పేర్కొన్నారు. 

"ఆర్టికల్ 370ని రద్దు చేస్తామని చెప్పాం... చేశామా, లేదా? మాట ఇచ్చి బీజేపీ నిలబెట్టుకుందా, లేదా? ఆర్టికల్ 370పై సినిమాలే వస్తున్నాయి. అయోధ్య భవ్య మందిరం నిర్మిస్తామన్నాం... నిర్మించామా, లేదా? అయోధ్య రామయ్యను మీరంతా స్వాగతించారా, లేదా?" అని ప్రశ్నించారు. 

భారత్ ను ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిలుపుతామని మోదీ ఉద్ఘాటించారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికశక్తిగా భారత్ ను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఈ గ్యారెంటీని నిలబెట్టుకుంటామని, ఇది మోదీ గ్యారెంటీ అని పేర్కొన్నారు. భారత్ ప్రపంచానికి ఆశాకిరణంలా మారిందని అన్నారు. 

కాంగ్రెస్ వందల కోట్ల అవినీతిని బద్దలు కొడుతున్నానని, కాంగ్రెస్ నేతలు తనను తిడుతున్నారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. వారసత్వ రాజకీయాలను తాను వ్యతిరేకిస్తున్నానని స్పష్టం చేశారు. కుటుంబ వాదం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. కుటుంబ వాదులకు దోపిడీ చేసే లైసెన్స్ ఉందా? అని ప్రశ్నించారు. 

కుటుంబ పార్టీలు ఉన్న చోట ఆ కుటుంబాలు బాగుపడ్డాయి కానీ ప్రజలు బాగుపడలేదని పేర్కొన్నారు. కొందరు కుటుంబవాదులు గిఫ్టులు తీసుకుని తమ ఖజానా నింపుకుంటారు... నాకు వచ్చిన గిఫ్టులను వేలం వేసి దేశం కోసమే ఖర్చు చేస్తున్నా అని మోదీ వివరించారు. కుటుంబవాదులు పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకున్నారు... నేను మాత్రం ఇప్పటివరకు ఒక్క ఇల్లు కూడా కట్టుకోలేదని వెల్లడించారు. కొందరు బ్లాక్ మనీ దాచుకోవడానికి విదేశీ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారని ఆరోపించారు.

More Telugu News