Chandrababu Letter: తనపై నమోదైన కేసుల వివరాలు కోరుతూ.. ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ

TDP Chief Chandrababu Wrote A Letter To AP DGP

  • త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో లేఖ రాసిన చంద్రబాబు
  • వ్యక్తిగతంగా వెళ్లి సమాచారం పొందడం సాధ్యం కాదని వ్యాఖ్య  
  • డీజీపీతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలకు లేఖ కాపీలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్న వేళ తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో తనపై నమోదైన కేసులకు సంబంధించిన వివరాలు తెలియజేయాలని అందులో కోరారు. ఎన్నికల నామినేషన్ పక్రియలో అభ్యర్థి తనపై ఉన్న కేసుల వివరాలు పేర్కొనాల్సి ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా కేసుల వివరాలు దాచిపెడితే.. ఎన్నికల్లో గెలిచినప్పటికీ అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తనపై నమోదైన కేసుల వివరాలు కోరినట్లు సమాచారం. అధికార పార్టీ కుట్రపూరితంగా వ్యవహరించే అవకాశం ఉందని, ఇందుకు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదనే ముందుచూపుతో చంద్రబాబు ఏపీ డీజీపికి లేఖ రాశారు.

చంద్రబాబు లేఖలోని ముఖ్యాంశాలు.. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి తమపై నమోదైన కేసుల వివరాలు నామినేషన్ సమయంలో అధికారులకు తెలియజేయాలి. బాధ్యతాయుత ప్రతిపక్ష నేతగా గడిచిన ఐదేళ్లుగా ప్రజాసమస్యలపై తాను పోరాడుతున్నట్లు చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం తనపై పలు అక్రమ కేసులు పెట్టించిందని ఆరోపించారు. రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలను అధికారులు తనకు తెలియజేయలేదని చెప్పారు. ఆయా పోలీస్ స్టేషన్లకు వ్యక్తిగతంగా వెళ్లి సమాచారం పొందడం ఆచరణలో సాధ్యం కాదు, కాబట్టి మీ ఆఫీసు నుంచి సమాచారం కోరుతున్నానని పేర్కొన్నారు. ఈ లేఖ కాపీని రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలకు, ఏసీబీ, సీఐడీ విభాగాలకు చంద్రబాబు పంపించారు.

  • Loading...

More Telugu News