US Presidential Polls: అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో నిక్కీ హేలీకి తొలి గెలుపు
- డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలో ట్రంప్ పై విజయం
- వరుస ఓటముల మధ్య హేలీకి ఊరట
- చివరి వరకూ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వ రేసులో ఉంటానన్న హేలీ
అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ పోరులో నిక్కీ హేలీ తొలి విజయాన్ని అందుకున్నారు. డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలో తన ప్రత్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై గెలిచారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కోసం జరుగుతున్న ప్రైమరీ ఎన్నికలలో హేలీ ఇప్పటి వరకూ వరుసగా ఓటమి పాలవుతూ వచ్చారు. చివరకు తన సొంత రాష్ట్రం సౌత్ కరోలినాలోనూ ఓడిపోయారు. అయినప్పటికీ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం చివరి వరకూ పోరాడుతానని హేలీ స్పష్టం చేశారు.
ఈ ఏడాది నవంబర్ మొదటి వారంలో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు, డెమోక్రాటిక్ పార్టీ నేత జో బైడెన్ మరోసారి పోటీలో ఉండగా.. రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్నారు. అయితే, అధ్యక్ష అభ్యర్థిని ఎంపిక చేసేందుకు డెమోక్రాటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీలలో ముందు ప్రైమరీ ఎన్నికలు నిర్వహిస్తారు. అధ్యక్ష అభ్యర్థిత్వం ఆశించే నేతలు ఇందులో పోటీపడతారు. పార్టీ ప్రతినిధుల మద్దతు ఎక్కువగా పొందిన నేత చివరకు పార్టీ అభ్యర్థిగా అధ్యక్ష ఎన్నికల్లో నిలుస్తారు.
రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీపడ్డ నేతలు తొలి రెండు ప్రైమరీలలో ఓటమిపాలై తప్పుకున్నారు. భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి కూడా ఇలాగే పోటీ నుంచి తప్పుకుని ట్రంప్ కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. అయితే, నిక్కీ హేలీ మాత్రం వరుస ఓటముల నేపథ్యంలోనూ ప్రైమరీ బరి నుంచి తప్పుకోలేదు.