Soumya Shetty: చోరీ కేసులో చిన్న సినిమాల నటి సౌమ్య శెట్టి అరెస్ట్

Police arrest actress Soumya Shetty

  • విశాఖలో రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి ప్రసాద్ ఇంట్లో బంగారం, నగదు చోరీ
  • ప్రసాద్ కుమార్తెతో సన్నిహితంగా ఉంటున్న సౌమ్య శెట్టి
  • తరచుగా ప్రసాద్ ఇంటికి వస్తున్న వైనం
  • కిలో బంగారం, నగదు చోరీ చేసి గోవా చెక్కేసిన నటి 

కొన్ని చిన్న సినిమాల్లో నటించిన సౌమ్య శెట్టి బంగారం, నగదు చోరీ కేసులో పట్టుబడింది. విశాఖ పోలీసులు ఆమెను గోవాలో అరెస్ట్ చేశారు. 

అసలేం జరిగిందంటే... విశాఖపట్నంలో ప్రసాద్ అనే రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. ఆయనకు ఒక కుమార్తె ఉంది. ఆ అమ్మాయి రీల్స్ చేస్తుంటుంది. అయితే, ప్రసాద్ కుమార్తెతో సౌమ్య శెట్టి సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పరచుకుంది. తనను తాను ఇన్ స్టాగ్రామ్ ఇన్ ఫ్లుయెన్సర్ గా చెప్పుకుని ఆ అమ్మాయితో స్నేహం చేసిన సౌమ్య శెట్టి తరచుగా ప్రసాద్ ఇంటికి వచ్చేది. 

ఈ క్రమంలో ఒక రోజు ప్రసాద్ ఇంట్లో కిలో బంగారం, నగదు చోరీకి గురయ్యాయి. అప్పటినుంచి సౌమ్య శెట్టి వారి ఇంటికి రావడం మానేసింది. పెద్ద మొత్తంలో బంగారం, డబ్బు కనిపించకపోయే సరికి ప్రసాద్ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సౌమ్య శెట్టిపై ప్రసాద్ కుటుంబం అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసుల ప్రాథమిక విచారణలో సౌమ్యశెట్టి గోవాలో ఉన్నట్టు వెల్లడైంది. ఆమె ఆచూకీ తెలుసుకున్న విశాఖ పోలీసులు... గోవా పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకుని విశాఖ తరలించారు. ప్రసాద్ ఇంట్లో బంగారం చోరీ చేసి గోవా వెళ్లి ఎంజాయ్ చేస్తున్నట్టు విచారణలో వెల్లడైంది. 

జూనియర్ ఆర్టిస్ట్ గా ఉన్న సౌమ్య శెట్టి గతంలో 'ది ట్రిప్', 'యువర్స్ లవింగ్లీ' వంటి పలు చిత్రాల్లో నటించింది. జల్సాలకు అలవాటు పడిన సౌమ్య శెట్టి ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో ఇలా అడ్డదారి తొక్కింది.

Soumya Shetty
Arrest
Theft
Police
Vizag
  • Loading...

More Telugu News