Pakistan: చైనా నుంచి పాకిస్థాన్ వెళ్తున్న నౌకను ముంబైలో ఆపివేసిన భారతీయ భద్రతా సంస్థలు

Ship From China To Pakistan Stopped At Mumbai Port Over Suspected Nuclear Cargo

  • అణు, బాలిస్టిక్‌ క్షిపణి కార్యక్రమానికి వినియోగించే సరుకు ఉందన్న అనుమానంతో తనిఖీలు
  • ‘కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్’ యంత్రాన్ని గుర్తించిన అధికారులు
  • పాకిస్థాన్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమాల్లో పరికరాల తయారీకి ఉపయోగించొచ్చంటున్న నిపుణులు

ఇటీవల చైనా నుంచి పాకిస్థాన్‌లోని కరాచీ వెళ్తున్న ఓ నౌకను ముంబై పోర్ట్ వద్ద భారతీయ భద్రతా ఏజెన్సీలు నిలిపివేశాయి. అణు, బాలిస్టిక్‌ క్షిపణి కార్యక్రమానికి వినియోగించే సరుకు ఉందన్న అనుమానంతో ఈ ఓడను ఆపివేసినట్టు అధికారులు శనివారం వెల్లడించారు. ముంబైలోని ‘నావా షెవా నౌకాశ్రయం’లో నౌకను నిలిపివేశామని కస్టమ్స్, ఇంటెలిజెన్స్ అధికారులు పేర్కొన్నారు. జనవరి 23న కరాచీకి వెళ్లే మార్గంలో మాల్టా జెండా ఉన్న ‘సీఎంఏ సీజీఎం అట్టిలా’ అనే వాణిజ్య నౌకను నిలిపివేశామని వివరించారు. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో తనిఖీ చేశామని తెలిపారు. ఇటలీకి చెందిన ఓ కంపెనీ తయారు చేసిన కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ (సీఎన్‌సీ) యంత్రాన్ని నౌకలో గుర్తించామని అధికారులు వెల్లడించారు.

కాగా సీఎంసీ యంత్రాలను కంప్యూటర్ల ద్వారా నియంత్రిస్తారు. అత్యధిక సామర్థ్యం, స్థిరత్వం, ఖచ్చితత్వం కోసం ఈ యంత్రాలను ఉపయోగిస్తుంటారు. నౌకలోని ఈ యంత్రాన్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) బృందం పరిశీలించింది. పొరుగుదేశం పాకిస్థాన్ ఈ యంత్రాన్ని తన అణు కార్యక్రమం కోసం ఉపయోగించే అవకాశం ఉందని డీఆర్‌డీవో బృందం నిర్ధారించింది. పాకిస్థాన్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమాల్లో కీలకమైన భాగాల తయారీకి ఈ యంత్రాన్ని ఉపయోగించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

More Telugu News