Sania Mirza: మహిళలపై వివక్ష ఇంకానా..?: వీడియో ట్వీట్ చేసిన సానియా మీర్జా

Sania Mirza Tweet On Urban Clan Company Add Goes Viral

  • ఓ కంపెనీ యాడ్ ను మెచ్చుకున్న మాజీ ప్లేయర్
  • మహిళల విజయానికి ఎలా విలువ కడుతున్నామని ప్రశ్న
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ట్వీట్

మహిళలపై వివక్ష ఇంకా కొనసాగడం విచారకరమని మాజీ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా పేర్కొన్నారు. ఓ మహిళ సాధించిన విజయానికి ఎలా విలువ కడుతున్నామని ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందంటూ ట్వీట్ చేశారు. తాజాగా ఓ కంపెనీ చేసిన యాడ్ వీడియోను ట్వీట్ చేస్తూ.. స్త్రీ, పురుష వివక్ష చూపొద్దంటూ నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు. అర్బన్ క్లాన్ కంపెనీ యాడ్ ను పోస్ట్ చేస్తూ సుదీర్ఘ వ్యాఖ్యానం చేశారు.

చోటీ సోచ్ పేరుతో అర్బన్ క్లాన్ కంపెనీ విడుదల చేసిన యాడ్ లో ఓ మహిళ బ్యూటీషియన్ గా పనిచేస్తూ ఓ కారు కొనుగోలు చేస్తుంది. కొత్త కారులో ఇంటికి వచ్చిన మహిళను చూసి చుట్టుపక్కల వాళ్లు హేళనగా మాట్లాడుతారు. పార్కింగ్ వద్ద క్రికెట్ ఆడుకుంటున్న ఆమె తమ్ముడు ఈ మాటలు విని బాధపడుతూ ఇంటికి వస్తాడు. ఇరుగుపొరుగు అన్న మాటలను అక్కకు చెబుతూ ఆవేదన చెందుతాడు. దీంతో ఆ మహిళ మాట్లాడుతూ.. ‘నేను కొన్న కారు అందరికీ కనబడుతుంది కానీ దానిని కొనేందుకు నేను పడ్డ శ్రమ, నా కష్టం ఎవరికీ కనిపించదు. ఓ మహిళ విజయం సాధించిన ప్రతిసారీ సమాజం ఆమెను కించపరచాలనే చూస్తుంది. అలాంటి మాటలకు బాధపడుతూ ఉన్నచోటనే ఆగిపోవాలా.. కష్టపడుతూ ముందుకు సాగాలా అనేది మన చేతుల్లోనే ఉంటుంది’ అని చెబుతుంది.

ఈ యాడ్ కు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సానియా మీర్జా ఈ వీడియో ట్వీట్ చేసి తన స్వంత విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ‘నా కెరీర్‌లో ఎంతోమంది మద్దతు ఇచ్చారు. కానీ, ఓ మహిళ విజయం సాధించినప్పుడు ఆమె కష్టాన్ని, నైపుణ్యాన్ని చూడాల్సింది పోయి ఆమె ఆహార్యం, అసమానతల గురించి ఎందుకు చర్చిస్తారనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. 2005లో డబ్ల్యూటీఏ టైటిల్‌ గెలిచిన తొలి భారత మహిళగా నిలిచాను. డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌ వన్‌గా ఉన్నప్పుడు.. నేను ఎప్పుడు స్థిరపడతానా అని ప్రజలు ఆసక్తిగా చూశారు. ఆరు గ్రాండ్‌స్లామ్‌లు గెలవడం ఈ సమాజానికి సరిపోలేదు. ఈ యాడ్‌ చూశాక నన్ను ఎన్నో ఆలోచనలు చుట్టుముట్టాయి. ఓ మహిళ సాధించిన విజయానికి మనం ఎలాంటి విలువ ఇస్తున్నామనే దానిపై ఆత్మపరిశీలన చేసుకోవాలి. కానీ, అది ఎప్పటికి జరిగేనో..!’’ అని సానియా తన పోస్టులో పేర్కొన్నారు.

More Telugu News