Google: గూగుల్ ప్లేస్టోర్ నుంచి భారత మ్యాట్రిమోనీ యాప్‌లు తొలగింపు
- ‘సర్వీస్ ఫీజు చెల్లింపు వివాదం’ నేపథ్యంలో నిర్ణయం
- యాప్‌లపై 15-30 శాతం ఫీజులు విధించవొద్దని అధికారులు ఆదేశాలివ్వడంతో గూగుల్ చర్యలు
- కోర్ట్ ఆదేశాలు అనుకూలంగా ఉండడంతో యాప్‌ల తొలగింపు
సెర్చింజన్ దిగ్గజం గూగుల్ కీలక చర్యకు ఉపక్రమించింది. గూగుల్ ప్లేస్టోర్ నుంచి భారత్‌కు చెందిన మ్యాట్రిమోనీ యాప్‌లను తొలగించడం మొదలుపెట్టింది. ‘భారత్ మ్యాట్రిమోనీ’ వంటి పాపులర్ యాప్ సహా మొత్తం 10 కంపెనీల యాప్‌లను గూగుల్ తొలగించనుంది. సర్వీస్ ఫీజు చెల్లింపు వివాదం కారణంగా గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ చర్య మ్యాట్రిమోనీ స్టార్టప్ సంస్థలకు శరాఘాతంగా మారింది. 11 - 26 శాతం ఫీజులు చెల్లించలేమంటూ మ్యాట్రీమోనీ యాప్‌ల నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేయడం ఈ వివాదానికి కేంద్ర బిందువుగా ఉంది. విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వ అధికారులు.. 15-30 శాతం ఫీజులు విధించే పాత విధానాన్ని రద్దు చేయాలంటూ కొద్దికాలం క్రితం ఆదేశాలు జారీ చేశారు. దీంతో గూగుల్ తాజా చర్యకు ఉపక్రమించింది.
మ్యాట్రిమోనీ స్టార్టప్‌లకు ఉపశమనం అవసరం లేదంటూ జనవరి, ఫిబ్రవరి నెలల్లో కోర్టులు పేర్కొన్నాయి. ఈ మేరకు దాఖలైన పిటిషన్లపై విచారణ అనంతరం ఆదేశాలు జారీ చేశాయి. ఫీజు వసూలు చేయవచ్చు లేదా యాప్‌లను తొలగించవచ్చని పేర్కొన్నాయి. దీంతో యాప్స్ తొలగింపునకు గూగుల్ ముందడుగు వేసింది. భారత్ మ్యాట్రిమోనీ, క్రీస్టియన్ మ్యాట్రిమోనీ, ముస్లిం మ్యాట్రీమోనీ, జోడీ యాప్‌లను గూగుల్ శుక్రవారం తొలగించిన విషయం తెలిసిందే.