Harish Rao: మేడిగడ్డలో కొన్ని పిల్లర్లు కుంగిపోతే ప్రాజెక్టు మొత్తం పోయినట్లుగా మాట్లాడుతున్నారు: హరీశ్ రావు

Harish Rao questions congress over medigadda issue

  • రేవంత్ రెడ్డి బృందం గతంలో మేడిగడ్డ వద్దకు వచ్చి ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చిందని ఆరోపణ
  • కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తోందన్న హరీశ్ రావు
  • కాంగ్రెస్ ప్రజాప్రయోజనాల కంటే రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తోందన్న మాజీ మంత్రి
  • మేడిగడ్డను రిపేర్ చేస్తామని ఉత్తమ్ చెప్పడం బీఆర్ఎస్‌కు పాక్షిక విజయమన్న హరీశ్ రావు

మేడిగడ్డలోని కొన్ని పిల్లర్లు మాత్రమే కుంగిపోతే ప్రాజెక్టు మొత్తం పోయినట్లుగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. మేడిగడ్డలో పర్యటించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో కొన్ని పిల్లర్లు మాత్రమే డ్యామేజ్ అయ్యాయని తెలిపారు. ఇక్కడకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం గతంలో వచ్చి ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. తాము మేడిగడ్డ పర్యటనకు వస్తే దాని నుంచి మళ్లించేందుకు కాంగ్రెస్ వాళ్లు పోటీ పర్యటనలు చేయడం విడ్డూరమన్నారు.

కాంగ్రెస్ ప్రజాప్రయోజనాల కంటే రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్‌ను పడగొట్టాలంటే కాళేశ్వరంను పడగొడితే చాలు అన్నట్లుగా అధికార పార్టీ తీరు ఉందని ఆరోపించారు. అసలు కేసీఆర్‌నే లేకుండా చేయాలని రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రగతి భవన్‌ను బాంబులతో పేలుస్తామన్న రేవంత్ ఇప్పుడు కేసీఆర్‌ను ఆనవాళ్లు లేకుండా చేస్తామని అనడం దారుణమన్నారు. తాము మేడిగడ్డ పర్యటన అనగానే కాంగ్రెస్ వాళ్లు కాగ్ రిపోర్ట్ అంటూ... పాలమూరు విజిట్ అంటూ వెళుతున్నారని మండిపడ్డారు.

తాము మేడిగడ్డ పర్యటనకు రాగానే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మేడిగడ్డను రిపేర్ చేస్తామని చెప్పారని వెల్లడించారు. అంటే బీఆర్ఎస్ పాక్షికంగా విజయం సాధించినట్లే అన్నారు. బీఆర్ఎస్‌పై ఇన్నాళ్లు కాంగ్రెస్ కుట్రలు చేసిందని ఆరోపించారు. ఎంతసేపూ మా మీద ఆరోపణలే తప్ప రైతుల కోసం పని చేయాలని చూడటం లేదన్నారు. అసత్య ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు.పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టినప్పుడు చిన్న చిన్న లోపాలు సహజమేనని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం కూలిపోయిందని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.

Harish Rao
Medigadda Barrage
Kaleshwaram Project
Congress
  • Loading...

More Telugu News