Ponnam Prabhakar: ముందు మాపై పోటీ చేసి గెలిచి చూపించాలి: కేటీఆర్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar challanges ktr

  • కేసీఆర్ కరీంనగర్ నుంచి పోటీ చేసి గెలిచి చూపించాలన్న పొన్నం ప్రభాకర్
  • మేడిగడ్డ కుంగడానికి బాధ్యులు ఎవరు? అని ప్రశ్న
  • ఇంట్లో ఒక పిల్లర్ కూలినా ఇల్లు కూలినట్లేనని వ్యాఖ్య
  • మేడిగడ్డ సాక్షిగా బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్

కేసీఆర్, కేటీఆర్‌లు ముందు తమపై పోటీ చేసి గెలిచి చూపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి, సీఎం పదవికి రాజీనామా చేసి వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరిలో ముఖాముఖి తలపడదామని కేటీఆర్ సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఈ సవాల్‌పై పొన్నం ప్రభాకర్ పైవిధంగా స్పందించారు. కేసీఆర్ కు దమ్ముంటే కరీంనగర్ నుంచి పోటీ చేసి గెలవాలన్నారు. ఆయన సచివాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

మేడిగడ్డ కుంగడానికి బాధ్యులు ఎవరు?

మేడిగడ్డ కుంగడానికి బాధ్యులు ఎవరు? అని మంత్రి ప్రశ్నించారు. మేడిగడ్డను బొందలగడ్డగా మార్చారని ఆరోపించారు. ఒక పిల్లర్ కూలిందని చెబుతున్నారని, కానీ ఇంట్లో ఒక పిల్లర్ కూలినా ఇల్లు కూలినట్లేనని గుర్తించాలన్నారు. బీఆర్ఎస్ నేతల మేడిగడ్డ పర్యటన హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. అంతా చేసి చివరకు తాము ఏమీ తప్పు చేయనట్లుగా మాట్లాడటం విడ్డూరమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రాష్ట్రంపై మోయలేని భారాన్ని మోపారని ఆరోపించారు. కమీషన్ల కోసమే ఈ ప్రాజెక్టును నిర్మించారని విమర్శించారు. ప్రజాధనాన్ని వృథా చేసినందుకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మేడిగడ్డ సాక్షిగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Ponnam Prabhakar
KTR
Congress
BRS
  • Loading...

More Telugu News