Srikalahasti: శ్రీకాళహస్తిలో మార్చి 3 నుంచి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు

Brahmotsavams in Srikalahasti will be commenced from Mar 3

  • మార్చి 8న మహా శివరాత్రి
  • ముస్తాబవుతున్న శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం
  • శివరాత్రి రోజున లక్ష మంది భక్తులు వస్తారని అంచనా
  • సమీక్ష నిర్వహించిన తిరుపతి జిల్లా కలెక్టర్, ఎస్పీ

ఈ ఏడాది మార్చి 8న మహా శివరాత్రి పర్వదినం నేపథ్యంలో, ప్రముఖ శైవ క్షేత్రం శ్రీకాళహస్తిలో బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. 

ప్రముఖ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తిలో మార్చి 3 నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా వెల్లడించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా శ్రీకాళహస్తిలో 21 రోజుల పాటు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలిపారు. 

భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తారని, ఒక్క శివరాత్రి రోజునే లక్ష మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులు సంతృప్తికరంగా దర్శనం చేసుకుని వెళ్లొచ్చని అన్నారు. తెప్పోత్సవం రోజున కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వస్తారు కాబట్టి శ్రీకాళహస్తికి ఆర్టీసీ అదనపు బస్సులు నడపనుందని కలెక్టర్ వెల్లడించారు. 

జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ మాట్లాడుతూ... ఈ బ్రహ్మోత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించారని వెల్లడించారు. శ్రీకాళహస్తి ఆలయం దేశవ్యాప్తంగా ప్రముఖమైనది కాబట్టి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారని, వారికి భద్రత కల్పించే విషయంలో రాజీ పడకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ వివరించారు. 

బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై నేడు నిర్వహించిన సమీక్ష కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, ఎస్పీ మల్లికా గార్గ్, ఆలయ పాలకమండలి సభ్యులు, దేవాలయ అధికారులు హాజరయ్యారు.

Srikalahasti
Maha Sivaratri
Brahmotsavam
Tirupati District
  • Loading...

More Telugu News