ISRO: ఇస్రో రాకెట్‌పై చైనా జెండా.. డీఎంకే పరిధులు దాటేసిందంటూ మోదీ ఫైర్
- కులశేఖరపట్టణంలో ఇస్రో సెకండ్ లాంచ్ ప్యాడ్
- మోదీ, స్టాలిన్ ఫొటోతో పత్రికల్లో ప్రకటనలు ఇచ్చిన తమిళ మంత్రి అనితా రాధాకృష్ణ
- యాడ్‌లోని రాకెట్‌పై చైనా పతాకం
- అది డిజైనర్ తప్పని, దానిని అంతగా పట్టించుకోవాల్సిన పనిలేదన్న కణిమొళి
తమిళనాడులోని కులశేఖరపట్టణంలో ఇస్రో ఏర్పాటు చేసిన సెకండ్ లాంచ్ ప్యాడ్‌కు సంబంధించి దినపత్రికల్లో ఇచ్చిన ప్రకటన రాజకీయ చిచ్చు రేపింది. ఆ యాడ్‌లో ఓవైపు ప్రధాని మోదీ, మరోవైపు ముఖ్యమంత్రి స్టాలిన్ మధ్యలో ఇస్రో రాకెట్ ఉంది. అయితే, ఆ రాకెట్‌పై చైనా జెండా ఉండడం వివాదానికి కారణమైంది. తమిళనాడు పశుసంరక్షణశాఖ మంత్రి అనితా రాధాకృష్ణ వ్యక్తిగతంగా ఇచ్చిన ఈ ప్రకటనలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను డీఎంకే ప్రభుత్వం ఎలా పూర్తి చేస్తున్నదీ చెప్పుకొచ్చారు.
ఇక మన రాకెట్‌పై చైనా జెండా ఉండడాన్ని గుర్తించిన బీజేపీ.. డీఎంకే ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. దీనిపై తూత్తుకుడి ఎంపీ కణిమొళి (ఆమె నియోజకవర్గంలోనే ఇది నిర్మించారు) తన పార్టీని సమర్థించారు. అందులో పార్టీ తప్పు ఏమీ లేదని, అది ఆర్ట్ వర్క్ డిజైనర్ పొరపాటని, కాబట్టి దానికంత ప్రాధాన్యం అక్కర్లేదని కొట్టిపడేశారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాత్రం తీవ్రంగా స్పందించారు. డీఎంకే ప్రభుత్వం పనిచేయకున్నా తప్పుడు క్రెడిట్‌ను మాత్రం తీసుకుంటుందని ఎద్దేవా చేశారు. తమ పథకాలపై వారి స్టిక్కర్లను అంటించుకుంటున్నారని విమర్శించారు. ఇప్పుడు ఏకంగా పరిధులు దాటేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇస్రో లాంచ్ ప్యాడ్ క్రెడిట్ తీసుకునేందుకు ఏకంగా చైనా స్టిక్కర్ అంటించారని మండిపడ్డారు. అంతరిక్ష రంగంలో భారత ప్రగతిని అంగీకరించేందుకు వారికి మనసు ఒప్పదని, భారత అంతరిక్ష విజయాలను ప్రపంచానికి అందించాలని వారు కోరుకోరని పేర్కొన్నారు. వారు మన శాస్త్రవేత్తలు, అంతరిక్ష రంగాన్ని దారుణంగా అవమానించారని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన తప్పులకు డీఎంకేను ఇప్పుడు శిక్షించాల్సిందేనని పేర్కొన్నారు.