H1B Visa: హెచ్-1బీ వీసా ప్రక్రియపై వైట్ హౌస్ కీలక ప్రకటన
- హెచ్-1బీ వీసా ప్రక్రియ మెరుగుదలకు అధ్యక్షుడు బైడెన్ చేయాల్సినదంతా చేస్తున్నారని ప్రకటన
- బ్యాక్‌లాగ్ గ్రీన్‌కార్డులు సహా చట్టబద్ధ ఇమ్మిగ్రేషన్ విధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు వెల్లడి
- ఇండియన్ అమెరికన్లను ఉద్దేశిస్తూ వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కీలక వ్యాఖ్యలు
భారతీయ ఐటీ నిపుణుల్లో ఆదరణ కలిగిన హెచ్-1బీ వీసా ప్రక్రియ మెరుగుదలకు అధ్యక్షుడు జో బైడెన్ చేయాల్సినదంతా చేస్తున్నారని అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ప్రకటించింది. బ్యాక్‌లాగ్ గ్రీన్ కార్డ్‌లు, చట్టబద్ధ ఇమ్మిగ్రేషన్ విధానానికి సంబంధించిన ఇతర సమస్యల పరిష్కారానికి బైడెన్ కృషి చేస్తున్నారని వైట్ హౌస్ పేర్కొంది.
హెచ్-1బీ వీసా ప్రక్రియకు సంబంధించి మెరుగుదల చర్యలు తీసుకున్నామని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ బుధవారం వెల్లడించారు. రోజువారీ మీడియా సమావేశంలో భాగంగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. అమెరికాకు అక్రమంగా వలస వచ్చినవారి ఇబ్బందుల పరిష్కారంపై పెట్టిన శ్రద్ధ.. చట్టబద్ధంగా వచ్చినవారి విషయంలో చూపడం లేదనే భావనలో ఉన్న ఇండియన్ అమెరికన్లను ఉద్దేశించి ఆమె ఈ వివరణ ఇచ్చారు. ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు, మోసాలను అరికట్టేందుకు గత నెలలోనే ఒక నిబంధనను తీసుకొచ్చామని జీన్-పియర్ ప్రస్తావించారు. ఈ మార్పులు చక్కటి ఫలితాలు ఇస్తాయని ఆశిస్తున్నామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. వీసా ప్రక్రియను మెరుగుపరిచే ప్రక్రియ కోసం చేయాల్సినదంతా చేస్తూనే ఉంటామని పేర్కొన్నారు.