Chalam: తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీ రామారావుగారిని 'డాడీ' అని పిలిచింది మా నాన్నగారు మాత్రమే: హీరో చలం తనయుడు రవిశంకర్

Ravi Shankar Chalam Interview

  • మా నాన్నగారు తన 18వ ఏటనే సినిమాల్లోకి వెళ్లారన్న రవిశంకర్   
  • ఎస్వీఆర్ గారు, నాన్నగారు ఇద్దరూ కూడా గురుశిష్యులలా ఉండేవారని వెల్లడి  
  • బాలచందర్ గారి సూచనతోనే నాన్నగారు సొంత ప్రొడక్షన్ మొదలుపెట్టారని వివరణ  

చలం .. తెలుగు తెరపై చాలా కాలం పాటు సందడి చేసిన పేరు. హీరోయిజానికి కామెడీ టచ్ ఇచ్చిన నటుడు. ఒకానొక దశలో వరుస హిట్లతో దూసుకుపోయిన హీరో. అలాంటి చలం గురించి ఆయన తనయుడు రవిశంకర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "మా నాన్నగారు తన 18వ ఏటనే సినిమాల్లోకి వెళ్లారు. 'దాసి' సినిమాలో లక్ష్మీరాజ్యం తనయుడి పాత్రలో తెరపై కనిపించారు" అని అన్నారు. 

"తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీ రామారావుగారిని 'డాడీ' అని పిలిచింది మా నాన్నగారు మాత్రమే. ఆ ఇద్దరి మధ్య అంతటి అనుబంధం ఉండేది. ఇక ఎస్వీఆర్ గారు .. నాన్నగారు ఇద్దరూ కూడా గురుశిష్యుల మాదిరిగా ఉండేవారు. సావిత్రిగారు మా నాన్నగారిని ఒక తమ్ముడిలా చూసుకునేవారు. భానుమతిగారు మా నాన్నగారిని 'రమణాచలం' అని ఎంతో ప్రేమగా పిలిచేవారు. మా అమ్మగారి పేరు రమణ .. ఆ పేరుతోనే నాన్నగారు సినిమాలు నిర్మించారు. మా అమ్మగారు జమీందారుగారి ఫ్యామిలీ నుంచి వచ్చారు" అని చెప్పారు. 

"బాలచందర్ గారి సూచన మేరకే నాన్నగారు సొంత ప్రొడక్షన్ మొదలుపెట్టారు. నటన పరంగా చలంగారు ఒక డిక్షనరీ అని ఒక సందర్భంలో కోట గారు అన్నారు. చలం గారు ఒక ట్రెండ్ సెట్టర్ అని రవిరాజా పినిశెట్టిగారు ఒక సందర్భంలో చెప్పారు. ఇక బాలూగారైతే ఒక కార్యక్రమంలో నన్ను స్టేజ్ పైకి పిలిచి, 'గాయకుడిగా తనకి జన్మనిచ్చింది కోదండపాణిగారైతే, గాయకుడిగా ఎదగడానికి నిచ్చెన వేసింది చలం గారు' అన్నారు. అంతకుమించి ఏం కావాలి? అంటూ ఆ క్షణాలను తలచుకున్నారు.

More Telugu News