Bandi Sanjay: బండి సంజయ్ కాన్వాయ్‌పై కోడిగుడ్ల దాడి... మీరు అవసరం లేదంటూ పోలీసులపై సంజయ్ ఆగ్రహం
- ముల్కనూరు బయలుదేరుతుండగా వంగరలో కోడిగుడ్ల దాడి
- బండి సంజయ్ కాన్వాయ్‌లోని మీడియా కాన్వాయ్‌పై పడిన కోడిగుడ్లు
- దాడి చేసినా పట్టించుకోవడం లేదని, తనకు పోలీస్ సెక్యూరిటీ అవసరం లేదని సంజయ్ ఆగ్రహం
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో బుధవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో ఆయన కాన్వాయ్‌పై కోడిగుడ్లతో దాడి చేశారు. వంగరలో దివంగత పీవీ నరసింహారావు ఇంటిని సందర్శించిన అనంతరం ఆయన ముల్కనూరు బయలుదేరారు. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు కోడిగుడ్లు విసరడంతో అవి కాన్వాయ్‌లోని మీడియా వాహనంపై పడ్డాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిన్న కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోనూ ప్రజాహిత యాత్రను అడ్డుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు.
పోలీసులను వెళ్లిపోమన్న బండి సంజయ్
తమపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు నిమిత్తమాత్రంగా ఉండిపోయారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి... దాడి చేస్తే మీరు చూడటం తప్ప ఏమీ చేయడం లేదు... మీరు (పోలీసులు) నాకు అవసరం లేదు... మీరు వెళ్లిపోండి... మాకు రక్షణ ఇవ్వడం లేదు... కానీ పాపం కానిస్టేబుళ్లు ఎండలో ఇబ్బంది పడుతున్నారు... మాకు మీ రక్షణ అవసరం లేదు' అని పోలీసు అధికారులతో బండి సంజయ్ చెప్పారు. పోలీసుల సమక్షంలో గుడ్లతో దాడి జరిగితే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 'నాకు మీ భద్రత అక్కరలేదు... పోలీసులు నాతో రావొద్దు... మా కార్యకర్తలు చూసుకుంటారు' అని చెప్పారు. మీ సెక్యూరిటీ మాకు అవసరమే లేదంటూ అక్కడి నుంచి ఆయన వెళ్లిపోయారు.
పొన్నం ఆదేశాల మేరకేనని ఆరోపణ
మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకే కాంగ్రెస్ కార్యకర్తలు దాడులకు తెగబడుతున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. పోలీసులకు ముందే సమాచారం ఇచ్చినా చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.