Tata Cancer Institute: క్యాన్సర్‌ చికిత్సపై పరిశోధనలో టాటా ఇన్‌స్టిట్యూట్ సంచలన విజయం.. రూ.100లకే టాబ్లెట్

Tata Institute Claims that is Succeded In Cancer Treatment

  • రెండవసారి క్యాన్సర్ రాకుండా చికిత్స కనిపెట్టిన పరిశోధకులు
  • శరీరంలోని క్యాన్సర్ మృత కణాలు రక్తం ద్వారా ఇతర శరీర భాగాలకు వెళ్లకుండా చెక్
  • కేవలం రూ.100 ధరతో కొత్త టాబ్లెట్ ఆవిష్కరించిన టాటా ఇన్సిస్టిట్యూట్ వైద్యులు
  • జూన్-జులైలో మార్కెట్‌లోకి అందుబాటులోకి రానున్న టాబ్లెట్లు

ముంబైలోని ప్రముఖ క్యాన్సర్ పరిశోధన, చికిత్స సంస్థ ‘టాటా ఇన్‌స్టిట్యూట్’ కీలకమైన ప్రకటన చేసింది. క్యాన్సర్‌ రెండవసారి రాకుండా నిరోధించే చికిత్సను విజయవంతంగా కనుగొన్నామని వెల్లడించింది. ఈ మేరకు ఒక టాబ్లెట్‌ను అభివృద్ధి చేశామని పరిశోధనా బృందంలో భాగమైన టాటా మెమోరియల్ హాస్పిటల్ సీనియర్ క్యాన్సర్ సర్జన్ డాక్టర్ రాజేంద్ర బద్వే తెలిపారు. టాబ్లెట్ విలువ కేవలం రూ.100 అని తెలిపారు. ఈ చికిత్స కోసం ఇన్సిస్టిట్యూట్ పరిశోధకులు, వైద్యులు దాదాపు 10 ఏళ్లు కృషి చేశారని వెల్లడించారు. పరిశోధకులు అభివృద్ధి చేసిన టాబ్లెట్ రోగులలో రెండవసారి క్యాన్సర్ రాకుండా నివారిస్తుందని పేర్కొన్నారు. రేడియేషన్, కీమోథెరపీ వంటి చికిత్సల దుష్ప్రభావాలను కూడా 50 శాతం మేర తగ్గించే సామర్థ్యం ఈ టాబ్లెట్‌కు ఉందని డాక్టర్ రాజేంద్ర బద్వే వివరించారు.

‘‘ఈ పరిశోధన కోసం పరిశోధకులు ఎలుకలలో మానవ క్యాన్సర్ కణాలను ప్రవేశపెట్టారు. దాంతో క్యాన్సర్ కణితి ఏర్పడింది. ఆ తర్వాత ఎలుకలకు రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ, సర్జరీతో చికిత్స అందించారు. ఈ క్యాన్సర్ కణాలు చనిపోయి ‘క్రోమాటిన్ కణాలు’ అని పిలిచే చిన్న ముక్కలుగా విడిపోయాయని గుర్తించారు. ఈ చిన్న కణాలు రక్తం ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఆరోగ్యకరమైన కణాలలోకి ప్రవేశిస్తే మళ్లీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. 
రెండవసారి క్యాన్సర్ వచ్చే అవకాశాలను నిరోధించేందుకు వైద్యులు ఎలుకలకు రెస్వెరాట్రాల్, కాపర్ (R+Cu) కలిగిన ప్రో-ఆక్సిడెంట్ మాత్రలు ఇచ్చారు. కాపర్ (R+Cu) ఆక్సిజన్ రాడికల్‌లను ఉత్పత్తి చేస్తుంది. క్రోమాటిన్ కణాలను నాశనం చేస్తుంది’’ అని రాజేంద్ర బద్వే వివరించారు. 

పరిశోధకులు అభివృద్ధి చేసిన టాబ్లెట్ క్యాన్సర్ చికిత్స దుష్ప్రభావాలను 50 శాతం మేర తగ్గిస్తుందని ఆయన వివరించారు. ఇక రెండవసారి క్యాన్సర్‌ను నివారించడంలో 30 శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని తెలిపారు. ఈ టాబ్లెట్ కు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదం లభించాల్సి ఉందన్నారు. ఇది జూన్-జులై నుంచి మార్కెట్‌లోకి వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు.

More Telugu News