Director Krish: రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు... నిందితుడిగా సినీ డైరెక్టర్ క్రిష్ పేరు

Director krish name in radisson hotel drugs case

  • అదే హోటల్లో నిర్వాహకుడితో డైరెక్టర్ క్రిష్ భేటీ
  • రాడిసన్ హోటల్‌కు స్నేహితులను కలిసేందుకు వెళ్లినట్లు చెప్పిన క్రిష్
  • పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు వెల్లడి
  • డ్రైవర్ రాగానే ఆ హోటల్ నుంచి వచ్చేసినట్లు తెలిపిన క్రిష్

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ పేరును పోలీసులు చేర్చారు. ఎఫ్ఐఆర్‌లో ఎనిమిదో నిందితుడిగా ఆయనను చేర్చారు. కొకైన్‌తో డ్రగ్ పార్టీ జరుగుతున్నట్లుగా సమాచారం రావడంతో ఎస్‌వోటీ పోలీసులు సోమవారం రాడిసన్ హోటల్‌పై దాడి చేసి సినీ పరిశ్రమతో సంబంధం ఉన్న ముఠాను అరెస్ట్ చేశారు. ఈ పార్టీ జరుగుతున్న సమయంలో క్రిష్ అదే హోటల్‌లో పార్టీ నిర్వాహకుడు వివేకానందతో మాట్లాడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. పార్టీ జరిగిన గదిలో దాదాపు అరగంట పాటు వీరిద్దరు మాట్లాడుకున్నారు. క్రిష్ పేరు తెరపైకి రావడంతో మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం మొదలైంది. ఇతరుల పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

వెళ్లింది నిజమే... క్రిష్

రాడిసన్ హోటల్‌కు వెళ్లినట్లుగా వార్తలు రావడంపై డైరెక్టర్ క్రిష్ స్పందించారు. తాను రాడిసన్ హోటల్‌కు వెళ్లిన మాట వాస్తవమే అన్నారు. తాను స్నేహితులను కలిసేందుకు హోటల్‌కు వెళ్లానని తెలిపారు. సాయంత్రం అక్కడ తాను అరగంట పాటు మాత్రమే ఉన్నానని... ఆ తర్వాత తన డ్రైవర్ రాగానే అక్కడి నుంచి వచ్చేసినట్లు తెలిపారు. పోలీసులు తనను ప్రశ్నించారని... అక్కడకు తాను ఎందుకు వెళ్లాననే విషయమై స్టేట్‌మెంట్ ఇచ్చానన్నారు.

ఏం జరిగింది?

రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్‌తో పార్టీలు చేసుకుంటున్న రాజకీయ, వ్యాపార, సినీ పరిశ్రమతో సంబంధమున్న ముఠాను ఎస్‌వోటీ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ హోటల్‌లో కొకైన్‌తో డ్రగ్‌ పార్టీ జరుగుతున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు హోటల్‌పై దాడి చేశారు. అప్పటికే ముఠా పరారు కావడంతో పార్టీ నిర్వాహకుడు వివేకానంద ఇంటికి వెళ్లి సోదాలు నిర్వహించారు. ఆయనకు పరీక్షలు నిర్వహించగా డ్రగ్స్‌ వాడినట్టు తేలింది. దీంతో అతనిని అదుపులోకి తీసుకున్నారు. వివేకానంద ఇచ్చిన సమాచారంతో సయ్యద్ అబ్బాస్ అలీ జెఫ్రీ, నిర్భయ్‌, కేదార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఆరుగురి కోసం గాలిస్తున్నారు. నిందితుల నుంచి కొకైన్ వాడిన కవర్లు, డ్రగ్స్‌కు ఉపయోగించిన పేపర్లు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News