Vishnu Vardhan Reddy: 30 ఏళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్నా.. ఎంపీ టికెట్ ఇవ్వాలని హైకమాండ్ ని అడిగా: విష్ణువర్ధన్ రెడ్డి
- హిందూపురం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని ఉందన్న విష్ణువర్ధన్ రెడ్డి
- టికెట్ అడిగే హక్కు అందరికీ ఉంటుందని వ్యాఖ్య
- తన విషయంలో హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుందన్న విష్ణు
హిందూపురం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని ఉందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. తమ పార్టీ హైకమాండ్ ఆదేశిస్తే హిందూపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని తెలిపారు. ఒక సామన్య కార్యకర్త స్థాయి నుంచి గత 30 ఏళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్నానని చెప్పారు. టికెట్ అడిగే హక్కు అందరికీ ఉంటుందని... స్థానికుడైన తనకు హిందూపురం ఎంపీ టికెట్ ఇస్తే పోటీ చేస్తానని అన్నారు. హిందూపురం నుంచి పోటీ చేయాలనే తన ఆలోచనను రాష్ట్ర నాయకత్వంతో పాటు కేంద్ర నాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్లానని చెప్పారు. తాను పోటీ చేసే విషయంలో హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.
పొత్తులు కుదరకపోతే హిందూపురం నుంచి ఒంటరిగా పోటీ చేస్తారా? అనే ప్రశ్నకు సమాధానంగా పార్టీ నిర్ణయం మేరకు నడుచుకుంటానని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. బీజేపీతో పొత్తు కోసం టీడీపీ, జనసేనలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ... ఆ పార్టీ నుంచి ఇంకా క్లారిటీ రాని సంగతి తెలిసిందే. దీంతో టీడీపీ, జనసేనలు బీజేపీతో సంబంధం లేకుండా తొలి జాబితాను విడుదల చేశాయి.