Ramana Dikshitulu: తిరుమల కొండపై జరుగుతున్న దారుణాలను రమణ దీక్షితులు అందరికీ తెలిసేలా చేశారు: నారా లోకేశ్
- తిరుమల గౌరవ ప్రధాన అర్చకుడి పదవి నుంచి రమణ దీక్షితులును తొలగించిన టీటీడీ
- తిరుమల ప్రతిష్ఠను దెబ్బతీసేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారన్న లోకేశ్
- రమణ దీక్షితులుపై వేటు వేయడం బాధాకరమని వ్యాఖ్య
రమణ దీక్షితులును తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకుడి పదవి నుంచి టీటీడీ పాలకమండలి తొలగించిన సంగతి తెలిసిందే. టీటీడీ ప్రతిష్ఠ దెబ్బతినేలా రమణ దీక్షితులు కామెంట్ చేశారనే కారణంతో ఆయనను తొలగించారు. ఈ నేపథ్యంలో టీడీపీ యువనేత నారా లోకేశ్ స్పందిస్తూ... తిరుమల ప్రతిష్ఠ దెబ్బతినేలా వైసీపీ నేతల అకృత్యాలు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు.
టీటీడీలో జరుగుతున్న అకృత్యాలను బయటపెట్టిన రమణ దీక్షితులుపై వేటు వేయడం బాధాకరమని లోకేశ్ అన్నారు. జరుగుతున్న దారుణాలను భక్తులకు తెలిసేలా రమణ దీక్షితులు చేశారని చెప్పారు. తిరుమల కొండపై టీటీడీ అధికారులు, వైసీపీ నేతలు కలిసి దారుణాలకు ఒడిగడుతున్నారని దుయ్యబట్టారు. రమణ దీక్షితులును అరెస్ట్ చేయడానికి ప్రయత్నించడం సీఎం జగన్ అహంకారానికి నిదర్శనమని చెప్పారు.