: శిఖరారోహణతో డబుల్ బెనిఫిట్!
ఆమె కొంతకాలం క్రితం వరకూ ఒక మామూలు కానిస్టేబుల్. అయితే ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఎవరెస్టును అధిరోహించడంతో ఆమె జీవన విధానం మారిపోయింది. అంతటి మహత్కార్యాన్ని సాధించిన సదరు కానిస్టేబుల్‌ను సముచితంగా గౌరవించాలనుకున్న ముఖ్యమంత్రిగారు ఆమెకు ఏకంగా డబుల్ ప్రమోషన్ ఇచ్చేశారు. ఈశాన్య భారతదేశంలోని మేఘాలయ రాష్ట్రానికి చెందిన వాన్‌సుక్ మైత్రాంగ్ ఒక సాధారణ మహిళా కానిస్టేబుల్. ఆమె ఎవరెస్టును అధిరోహించాలనుకున్నారు. దీంతో మార్చి 20న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జెండా ఊపి ప్రారంభించిన ఈశాన్య రాష్ట్రాల పర్వతారోహకుల బృందంలో మైత్రాంగ్ చోటు సంపాదించారు. ఎవరెస్టును అధిరోహించి ఈ ఘనతను సాధించిన ప్రప్రధమ ఖాసీ గిరిజన జాతికి చెందిన మహిళగా ఆమె ఒక ప్రత్యేక రికార్డును సాధించారు.
ఇంతటి ఘనతను సాధించిన మైత్రాంగ్‌ను సత్కరించాలని భావించిన మేఘాలయ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా ఆమెకు ఉద్యోగంలో డబుల్ ప్రమోషన్ ఇస్తున్నట్టు ప్రకటించారు. దీంతో కానిస్టేబుల్‌గా ఉన్న మైత్రాంగ్ ఏకంగా అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొందింది. అంతేకాదు... బుధవారం నాడు మేఘాలయ గవర్నర్ ఆర్.ఎస్.మూషాహారీ ఆమెను ఘనంగా సత్కరించారు. ఆమెచేత ఒక అరుదైన మొక్కను నాటించారు. ఆమె నాటిన 'మెయిడెన్‌హేర్' అనే అరుదైన మొక్క మూడువేల సంవత్సరాలకు పైగా జీవిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. మొత్తానికి ఎవరెస్టును ఎక్కడం వల్ల ఇంతటి గౌరవాన్ని మైత్రాంగ్ పొందింది!