Air India: క్లాసికల్ డ్యాన్స్ వీడియోతో ప్రయాణికులకు సేఫ్టీ సూచనలు.. వీడియో ఇదిగో!
- ఎయిర్ ఇండియా వినూత్న ఆలోచన
- నృత్య రూపంలో భద్రతా సూచనల ప్రదర్శన
- నెటిజన్లను ఆకట్టుకుంటున్న వీడియో
విమాన ప్రయాణం మొదలు కావడానికి ముందు ఎయిర్ హోస్టెస్ లు మైక్ ల ద్వారా ప్రయాణికులకు భద్రతా సూచనలు చేస్తుంటారు. సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలి.. క్యాబిన్ ఎయిర్ ప్రెషర్ తగ్గితే ఏం చేయాలి.. ఎమర్జెన్సీలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి.. తదితర వివరాలు చెబుతూ, చేతలతో చూపిస్తుంటారు. ప్రతీ విమానంలో ఇది సాధారణమే. అయితే, ఎయిర్ ఇండియా దీనికి ఓ కొత్త టచింగ్ ఇచ్చింది. వినూత్నంగా ఆలోచించి తన ప్రయాణికులకు ఓ వీడియో రూపంలో ఈ జాగ్రత్తలు చెబుతోంది.
మన దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రఖ్యాత నృత్య రీతులను మేళవించి ఫ్లైట్ సేఫ్టీ సూచనలతో వీడియో రూపొందించింది. విమానం ఎక్కినప్పటి నుంచి గమ్యం చేరాక కిందకు దిగేంత వరకు ఎలా నడుచుకోవాలో ఇందులో సూచించింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో వైరల్ గా మారింది. త్వరలోనే ఈ వీడియోను తమ విమానాల్లో ప్రయాణికుల కోసం ప్రదర్శిస్తామని ఎయిర్ ఇండియా పేర్కొంది. డైరెక్టర్ భరత్ బాల, సింగర్ శంకర్ మహదేవన్, మెక్ కాన్ వరల్డ్ గ్రూప్ కు చెందిన ప్రసూన్ జోషిలతో ఈ వీడియోను రూపొందించినట్లు తెలిపింది.