Donald Trump: అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల రేసులో డొనాల్డ్ ట్రంప్‌కు కీలక విజయం.. నిక్కీ హేలీ ఓటమి
- సౌత్ కరోలినా రిపబ్లికన్ ప్రైమరీలో ఎన్నికల్లో నిక్కీ హేలీపై నిర్ణయాత్మక గెలుపు సాధించిన మాజీ అధ్యక్షుడు
- అధ్యక్ష అభ్యర్థి రేసులో దూసుకెళ్తున్న ట్రంప్..
- ఇప్పటికే పలు రాష్ట్రాల్లో విజయం సాధించిన మాజీ అధ్యక్షుడు
మరోసారి అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాలని ఉవ్విళ్లూరుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత కీలకమైన విజయం సాధించారు. అధ్యక్ష అభ్యర్థి ఎంపిక కోసం నిర్వహించిన రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో సౌత్ కరోలినా నుంచి ట్రంప్ నిర్ణయాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నారు. రాష్ట్రంలో ప్రధాన పోటీదారుగా ఉన్న భారతీయ సంతతి వ్యక్తి నిక్కీ హేలీని ఆయన ఓడించారు. దీంతో అధ్యక్ష ఎన్నికల్లో నామినేషన్ దాఖలుకు ఆయన మరింత చేరువయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌కు సమానంగా నామినేషన్ దిశగా ట్రంప్ దూసుకెళ్తున్నారు.
77 ఏళ్ల వయసున్న ట్రంప్ మానసికంగా దృఢంగా లేరని, ఆయన మరోసారి అధ్యక్ష పదవి చేపడితే గందరగోళం తప్పదంటూ నిక్కీ హేలీ ప్రచారం చేసినప్పటికీ ఆమెకి ఓటమి తప్పలేదు. ట్రంప్ కంటే తాను ఉత్తమమని ఆమె చేసిన ప్రచారాలేవీ పెద్దగా ఫలించలేదు. ‘అమెరికా ఫస్ట్’ అనే డొనాల్డ్ ట్రంప్ నినాదం ఆయనకు కలిసి వస్తోంది. ఆయనపై నాలుగు తీవ్రమైన నేరారోపణలు, పలు సివిల్ వ్యాజ్యాలు దాఖలైనప్పటికీ అధ్యక్ష ఎన్నికల రేసులో డొనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్ గెలిచారు. అయోవా, న్యూ హాంప్‌షైర్ ట్రంప్ ఖాతాలో పడగా.. వివాదం కారణంగా నెవాడాలో ఆయన పోటీ చేయకుండా కోర్ట్ నిషేధం విధించిన విషయం తెలిసిందే.
ట్రంప్ విజయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడకపోయినప్పటికీ మార్జిన్‌ను బట్టి ఆయన గెలిచినట్టు స్పష్టమవుతోంది. అయితే దక్షిణకరోలినాలో నిక్కీ హేలీ ఓడినప్పటికీ మార్జిన్ తక్కువగా ఉండడం శుభసూచకంగా భావించాలని అమెరికా రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. జులైలో డొనాల్డ్ ట్రంప్‌పై నమోదైన క్రిమినల్ కేసులపై విచారణ జరగనుండడంతో ఏదైనా జరగవచ్చునని పేర్కొంటున్నారు. ట్రంప్‌కు జైలుశిక్ష పడితే నిక్కీ హేలీ రేసులోకి వచ్చే అవకాశాన్ని రాజకీయ నిపుణులు సూచిస్తున్నారు. కాగా నిక్కీ హేలీ గతంలో ఓ రాష్ట్రానికి గవర్నర్‌గా, ఐరాసలో అమెరికా ప్రతినిధిగా పని చేశారు.