Yarlagadda Venkatarao: అమెరికా నుంచి వచ్చాడు.. సౌమ్యుడు అనుకుంటున్నారేమో.. వైసీపీ నేతలకు యార్లగడ్డ వెంకట్రావు హెచ్చరిక

TDP Leader Yarlagadda Venkatarao warns YCP leaders

  • నియోజవర్గంలో టీడీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డ గన్నవరం అభ్యర్థి
  • దాడులు చేసి రివర్స్ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన యార్లగడ్డ
  • గన్నవరంలో సులభంగా గెలవగలనని ఆశాభావం వ్యక్తం చేసిన టీడీపీ నేత
  • టీడీపీకి మద్దతు ఇచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ధన్యావాదాలు తెలిపిన వెంకట్రావ్

తెలుగుదేశం పార్టీ గన్నవరం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావ్ అధికార వైసీపీపై విరుచుకుపడ్డారు. ‘అమెరికా నుంచి వచ్చాడు.. సౌమ్యుడు.. వివాద రహితుడు అనుకుంటున్నారేమో... జిల్లా ఎస్పీ పేరుని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘రెడ్ బుక్’లో చేర్చే బాధ్యతను వ్యక్తిగతంగా తీసుకుంటా’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. గన్నవరంలో దాడులు చేసి రివర్స్ కేసులు పెట్టే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ పోలీసులను విమర్శించారు. ఊరి చెరువు మట్టి కొంతమంది జేబులోకి వెళుతుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. 

రాష్ట్రంలో ఏ పని చేయాలన్నా అంగబలం, అర్థబలమే అవసరమైతే తన వద్ద రెండూ ఉన్నాయన్నారు. గొడవలే పరిష్కారం కాదని, గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ నేతలపై దాడులను ఖండిస్తున్నానని ఆయన చెప్పారు. పార్టీ ఆఫీసులపై దాడి, ఆస్తులు లాక్కొనే దుర్మార్గపు పరిస్థితులు గన్నవరంలోనే  ఉన్నాయని, ఇలాంటి ఫ్యాక్షన్ రాజకీయాలు కడపలో కూడా లేవని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. నాయకులను గెలిపించుకునేది పార్టీ కార్యాలయాలపై దాడుల కోసం కాదన్నారు. ఆరు సార్లు టీడీపీ గెలిచిన గన్నవరం నియోజకవర్గంలో తాను గెలవడం చాలా సులువు అని యార్లగడ్డ వెంకట్రావ్ దీమా వ్యక్తం చేశారు. టీడీపీకి మద్దతు తెలిపిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

నారా కుటుంబ సభ్యులపై నోరు పారేసుకోవడానికి ఇకనైనా అంతం లేదా అని వైసీపీ నేతలను ప్రశ్నించారు. బూతులు మాట్లాడటమే రాజకీయం అయితే రెండు రోజుల్లో నేర్చుకొని తాను కూడా మాట్లాడగలనని వెంకట్రావ్ అన్నారు. రోడ్లు, ఉపాధి లేక రాష్ట్రంలో చాలా మంది వలస వెళ్లే పరిస్థితి ఏర్పడిందని యార్లగడ్డ వెంకట్రావ్ ఆరోపించారు. రాష్ట్రంలో పరిశ్రమలు లేవని, ఈ దుస్థితి పోవాలంటే చంద్రబాబు రాష్ట్రానికి సీఎం కావాలని అభిలాషించారు.

  • Loading...

More Telugu News