Yashaswi Jaiswal: వీరేంద్ర సెహ్వాగ్ ఆల్ టైమ్ రికార్డ్‌ను బద్దలుకొట్టిన యశస్వి జైస్వాల్

Yashaswi Jaiswal breaks Virender Sehwags all time record
  • టెస్టు ఫార్మాట్‌లో ఒక క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారతీయుడిగా అవతరణ
  • 23 సిక్సర్లతో వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉన్న 22 సిక్సర్ల రికార్డును బ్రేక్ చేసిన యువ బ్యాట్స్‌మెన్
  • ఈ ఏడాది మొదటి 55 రోజుల్లోనే 23 సిక్సర్లు బాదిన జైస్వాల్
యువ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ టీమిండియాలో దొరికిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ ద్వారా కెరియర్‌లో అద్భుతమైన ఆరంభాన్ని అందుకున్నాడు. చక్కటి ఫామ్‌లో ఉన్న ఈ ఓపెనర్ పరుగుల వరద పారిస్తున్నాడు. క్యాలెండర్ ఏడాది 2024లో ఇప్పటి వరకు ఏడు టెస్టు ఇన్నింగ్స్‌ ఆడిన జైస్వాల్ ఏకంగా 618 పరుగులు బాదాడు. ఈ ఏడాది కేవలం మొదటి 55 రోజుల్లోనే ఈ రికార్డు స్థాయి పరుగులు సాధించాడు. 

ఈ క్రమంలో టీమిండియా మాజీ దిగ్గజం, డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును బద్దలుకొట్టాడు. టెస్టు ఫార్మాట్‌లో ఒక క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రికెటర్‌గా జైస్వాల్ అవతరించాడు. ఈ ఏడాది మొదటి 55 రోజుల్లో జైస్వాల్ ఏకంగా 23 సిక్సర్లు బాదాడు. 2008లో వీరేంద్ర సెహ్వాగ్ 28 ఇన్నింగ్స్‌ ఆడి 22 సిక్సర్లు కొట్టాడు. ఆ రికార్డును యువ కెరటం జైస్వాల్ బ్రేక్ చేశాడు. 

ఒక క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారతీయులు
1. యశస్వి జైస్వాల్- 2024లో 23 సిక్సర్లు
2. వీరేంద్ర సెహ్వాగ్ - 2008లో 22 సిక్సర్లు
3. రిషబ్ పంత్ - 2022లో 21 సిక్సర్లు
4. రోహిత్ శర్మ - 2019లో 20 సిక్సర్లు
5. మయాంక్ అగర్వాల్ - 2019లో 18 సిక్సర్లు.

మరోవైపు అద్భుతమైన ఫామ్‌లో ఉన్న యశస్వి జైస్వాల్ కేవలం 23 ఏళ్ల వయసులోపు ఒక సిరీస్‌లో 600లకు పైగా పరుగులు సాధించిన రెండవ భారతీయ క్రికెటర్‌గా నిలిచాడు. డాన్ బ్రాడ్‌మాన్, గ్యారీ సోబర్స్, గ్రేమ్ స్మిత్, సునీల్ గవాస్కర్ వంటి ఏడుగురు ఆటగాళ్లు మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు. కాగా జులై 2023లో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో జైస్వాల్ అరంగేట్రం చేశాడు. ఆ సిరీస్‌లో 171 పరుగులు చేశాడు. ఇక ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భయంకరమైన ఫామ్‌తో చెలరేగుతున్నాడు. రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన మూడో టెస్టులో భారత్ చారిత్రాత్మక 434 పరుగుల తేడాతో గెలుపులో జైస్వాల్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో 73 పరుగులు చేసి ఔటయ్యాడు.
Yashaswi Jaiswal
Virender Sehwag
Cricket Records
india vs England
Team India
Cricket

More Telugu News