Lasya Nanditha: లాస్య నందిత ఘటన నేపథ్యంలో... వీఐపీల డ్రైవర్లందరికీ ఫిట్ నెస్ పరీక్షలు
- రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత
- మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతల డ్రైవర్లకు టెస్టులు
- నైపుణ్యం లేని వారిని డ్రైవర్లుగా పెట్టుకోవద్దన్న మంత్రి పొన్నం ప్రభాకర్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ యువ నేత లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఈ ఘటన దిగ్భ్రాంతి కలిగించింది. ఈ నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీల డ్రైవర్లందరికీ ఫిట్ నెస్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
ప్రభుత్వం దీన్ని సుమోటోగా తీసుకుందని తెలిపారు. మొత్తం 33 జిల్లాల్లో రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రముఖుల డ్రైవర్లకు ఫిట్ నెస్ టెస్టులు నిర్వహిస్తారని వివరించారు. డ్రైవింగ్ నైపుణ్యం లేని వారిని విధుల్లో పెట్టుకోవద్దని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర రాజకీయ నేతలకు పొన్నం ప్రభాకర్ సూచించారు.