Botsa Satyanarayana: పీఆర్సీనే ఇస్తామంటున్నాం కదా... ఇక మధ్యంతర భృతి ఎందుకు?: మంత్రి బొత్స

Minister Botsa talks about PRC an IR

  • విజయవాడలో మంత్రివర్గ ఉప సంఘం, ఉద్యోగ సంఘాల మధ్య చర్చలు
  • పీఆర్సీ ఆలస్యమైనప్పుడే ఐఆర్ ఇస్తారన్న మంత్రి బొత్స
  • పూర్తిస్థాయి పీఆర్సీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడి
  • గతంలో ఉన్న ఐఆర్ సంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చారన్న బొప్పరాజు

ఏపీ మంత్రివర్గ ఉపసంఘం నేడు విజయవాడలో రాష్ట్ర ఉద్యోగ సంఘాల జేఏసీతో సమావేశమైంది. ఈ సమావేశం ముగిసిన అనంతరం  మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. పూర్తిస్థాయి పీఆర్సీ ఇచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఉద్యోగులకు కూడా ఆ మాటే చెప్పామని వెల్లడించారు. 

పీఆర్సీ ఆలస్యమైనప్పుడే మధ్యంతర భృతి ఇస్తారని, పూర్తిస్థాయిలో పీఆర్సీనే ఇస్తామంటున్నప్పుడు ఇక మధ్యంతర భృతి ఎందుకని ప్రశ్నించారు. మధ్యంతర భృతి ఇవ్వడం తమ ప్రభుత్వ విధానం కాదని, ఒకవేళ పీఆర్సీ ఆలస్యమైతే అప్పుడు మధ్యంతర భృతి గురించి ఆలోచిస్తామని మంత్రి బొత్స పేర్కొన్నారు. 

ఇక, మార్చి లోపు పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం పరిశీలిస్తుందని అన్నారు. ఉద్యోగులు 'ఛలో విజయవాడ' కార్యక్రమాన్ని విరమించుకోవాలని కోరామని తెలిపారు. 

బొప్పరాజు ఏమన్నారంటే...

ప్రభుత్వంతో చర్చల అనంతరం ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. రూ.4,831 కోట్ల పెండింగ్ బకాయిలు మార్చి చివరి నాటికి ఇస్తామని చెప్పారని వెల్లడించారు. పీఆర్సీ చెల్లింపులు కూడా రూ.14,102 కోట్లు చెల్లిస్తామన్నారని వివరించారు. 

పెన్షనర్లకు నగదు రూపంలో చెల్లించాల్సిన పీఆర్సీ పాత బకాయిలు ఎవరెవరికి ఎంతెంత చెల్లించాలో లెక్కలు తీసుకుని తదుపరి సమావేశంలో ప్రకటన చేస్తామని ప్రభుత్వం వెల్లడించిందని అన్నారు. 

గతంలో అమల్లో ఉన్న ఐఆర్ (మధ్యంతర భృతి) సంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చారని, అయితే, ఈ జులై లోపే పీఆర్సీని సెటిల్ చేసే కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుడతామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని బొప్పరాజు వివరించారు.

Botsa Satyanarayana
PRC
IR
Employees
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News