Akul Dhawan: అమెరికాలో చలికి గడ్డకట్టి.. భారత విద్యార్థి మృతి

Indian Origin Student Akul Dhawan Died By Freezing

  • ఇల్లినాయి యూనివర్సిటీలో చదువుతున్న 18 ఏళ్ల అకుల్ ధావన్
  • ఫ్రెండ్స్‌తో నైట్ అవుట్ కోసం క్యాంపస్ సమీపంలోని నైట్‌క్లబ్‌కు
  • ఒక్కడిగా వెళ్లడంతో లోపలికి అనుమతించని క్లబ్ సిబ్బంది
  • చేసేది లేక పక్కనే ఉన్న భవనం మెట్లపై నిద్రించిన అకుల్
  • చలికి గడ్డకట్టి ప్రాణాలొదిలిన విద్యార్థి

అమెరికాలో భారత సంతతికి చెందిన విద్యార్థి చలికి గడ్డకట్టి మరణించాడు. గత నెలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇల్లినాయి యూనివర్సిటీలో చదువుతున్న 18 ఏళ్ల అకుల్ ధావన్ గత నెల 19న రాత్రి 11.30 గంటల సమయంలో ఫ్రెండ్స్‌తో నైట్‌ అవుట్ కోసం క్యాంపస్ సమీపంలోని నైట్‌క్లబ్‌కు వెళ్లాడు. అయితే, అప్పటికే స్నేహితులు లోపల ఉండడంతో ఒక్కడిగా వెళ్లిన అకుల్‌ను క్లబ్ సిబ్బంది లోపలికి అనుమతించలేదు. పలుమార్లు అభ్యర్థించినప్పటికీ సిబ్బంది అతడిని లోపలికి పంపేందుకు నిరాకరించారు.

దీంతో చేసేది లేక పక్కనే ఉన్న భవనం మెట్లపై అకుల్ నిద్రపోయాడు. అయితే, గడ్డకట్టే చలికి తట్టుకోలేక ప్రాణాలు వదిలాడు. అతడి మృతదేహాన్ని 20న ఉదయం 11 గంటల సమయంలో గుర్తించారు. అకుల్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో అతడి స్నేహితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అకుల్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News