Farmers: ఘర్షణల నేపథ్యంలో.. రైతుల ‘ఛలో ఢిల్లీ’ మార్చ్‌ రెండు రోజులపాటు వాయిదా

Farmers Chloe Delhi march postponed for two days
  • పంజాబ్-హర్యానా సరిహద్దులో పోలీసులతో ఘర్షణ నేపథ్యంలో నిర్ణయం
  • శుక్రవారం సాయంత్రం భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడి
  • బుధవారం పోలీసులు-రైతుల మధ్య ఘర్షణ.. ఒక రైతు మృతి
పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, రుణమాఫీతో పాటు పలు డిమాండ్లతో దేశ రాజధాని దిశగా కదంతొక్కిన రైతులు రెండు రోజులపాటు ‘ఛలో ఢిల్లీ’ మార్చ్‌ను వాయిదా వేసుకున్నారు. పంజాబ్-హర్యానా సరిహద్దులో పోలీసులతో ఘర్షణ జరిగిన  నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తదుపరి కార్యాచరణను శుక్రవారం(ఫిబ్రవరి 23) సాయంత్రం వెల్లడిస్తామని పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ నాయకుడు సర్వన్ సింగ్ పందేర్ బుధవారం ప్రకటించారు. రైతులు-హర్యానా పోలీసుల మధ్య జరిగిన ఘర్షణపై ఆయన మీడియాతో మాట్లాడారు.

ఖనౌరీ-శంభు సరిహద్దుల్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై హర్యానా పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారని, దీనిని ఖండిస్తున్నామని అన్నారు. చాలా మంది రైతులు గాయపడ్డారని, చాలా మంది కనిపించడం లేదని పందేర్ పేర్కొన్నారు. ఈ పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని రాబోయే రెండు రోజుల పాటు 'ఛలో ఢిల్లీ’ మార్చ్‌ను నిలిపివేయాలని నిర్ణయించుకున్నామని, ఈ రెండు రోజుల విరామంలో గాయపడిన, కనిపించకుండా పోయిన రైతుల కుటుంబాలను కలుస్తామని వెల్లడించారు. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత హామీ విషయంలో ప్రభుత్వం పారిపోతోందని అన్నారు. రైతులు రహదారిని దిగ్బంధించలేదని, ప్రభుత్వమే ఆ పని చేసిందని ఆయన అన్నారు. శాంతియుతంగా ముందుకు వెళ్తామని చెబుతూనే ఉన్నామని పేర్కొన్నారు.

కాగా బుధవారం రైతులు-హర్యానా పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో ఒక యువ రైతు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ మరో ఇద్దరు రైతుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పాటియాలాలోని రజింద్ర హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ రేఖీ వెల్లడించారు. ఇక హర్యానా పోలీసు అధికారి మనీషా చౌదరి స్పందించారు. దాటా సింగ్-ఖానౌరీ సరిహద్దులో రైతు నిరసనకారులు పోలీసు సిబ్బందిని చుట్టుముట్టారని తెలిపారు. పోలీసులను అడ్డుకునేందుకు పంట వ్యర్థాలను తగలబెట్టి మంటల్లో కారం పోశారని, పోలీసులపైకి రాళ్లు రువ్వారని తెలిపారు. కర్రలతో పోలీసులపై దాడి చేశారని, ఈ ఘటనలో 12 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారని వివరించారు.
Farmers
Chalo Delhi
Punjab
Haryana
Delhi

More Telugu News