TDP: రేపు విజయవాడలో టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం
- ఏపీలో పొత్తు పెట్టుకున్న టీడీపీ, జనసేన
- ఉమ్మడి కార్యాచరణ కోసం సమన్వయ కమిటీ ఏర్పాటు
- ఇరు పార్టీల నుంచి సభ్యులు
ఏపీలో టీడీపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పటికీ సీట్ల సర్దుబాటుపై ఇప్పటికీ ఏకాభిప్రాయం కుదరలేదు. పొత్తును ముందుకు తీసుకెళతాం అని టీడీపీ, జనసేన అగ్రనేతలు చెబుతున్నారు కానీ, ఇరు పార్టీల నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది.
ఏప్రిల్ మూడో వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో, రేపు విజయవాడలో టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, తంగిరాల సౌమ్య... జనసేన తరఫున నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్, బొమ్మిడి నాయకర్, గోవిందరావు, యశస్విని హాజరుకానున్నారు.
క్షేత్రస్థాయిలో రెండు పార్టీల మధ్య సమన్వయం, ఉమ్మడి కార్యాచరణ, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై చర్రించనున్నారు. జిల్లాల్లో ప్రచార వ్యూహాల రూట్ మ్యాప్ పైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు.