Whatsapp Security feature: ఇతరుల ప్రొఫైల్ పిక్ ను స్క్రీన్ షాట్స్ తీయకుండా అడ్డుకట్ట.. కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తున్న వాట్సాప్!

You might not be able to take screenshots of others display picture

  • బీటా వర్షన్‌లలో ఈ కొత్త ఫీచర్‌ను టెస్టు చేస్తున్న వాట్సాప్
  • పిక్‌ను పొటో తీసేందుకు ట్రై చేస్తే స్క్రీన్ షాట్స్ సాధ్యం కాదంటూ నోటిఫికేషన్లు
  • వెబ్ వర్షన్‌లో చాట్‌లను సీక్రెట్ కోడ్‌తో లాక్ చేసేందుకు మరో ఫీచర్ పరిశీలన

యూజర్ల సమాచార గోప్యతను మరింత పటిష్ఠపరిచేలా వాట్సాప్ ఓ కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ఇతరుల వాట్సాప్ ప్రొఫైల్ పిక్‌ను స్క్రీన్ షాట్ తీసుకునేందుకు అవకాశం లేకుండా చేసే ఈ ఫీచర్‌ను బీటా వర్షెన్‌లో పరిశీలిస్తోంది. బీటా వర్షెన్ వాడుతున్న వారు ఈ స్క్రీన్ షాట్స్ కోసం ప్రయత్నిస్తే.. దీనికి అవకాశం లేదంటూ వాట్సాప్ నోటిఫికేషన్ పంపిస్తోందట. అనుమతి లేకుండా ఫొటోలు తీసి షేర్ చేసే ట్రెండ్‌కు వీలైనంతగా బ్రేకులు వేసేందుకు వాట్సాప్ ఈ నూతన ఫీచర్‌ను పరీక్షిస్తోంది. 

స్నాప్‌చాట్, పేటీఎం, గూగుల్ పే వంటి యాప్‌లలో ఈ ఫీచర్‌ ఇప్పటికే అందుబాటులో ఉంది. వ్యక్తిగత సమాచార గోప్యతకు భంగం కలిగించే సందర్భాల్లో ఈ యాప్స్ యూజర్లను ఇతరుల పిక్స్‌ను స్క్రీన్ షాట్ తీసేందుకు అనుమతించవు. దీంతో, కీలకసమాచారం చోరీ అయ్యే అవకాశం తగ్గుతుందని వాట్సాప్ చెబుతోంది. మరి కొన్ని వారాల్లో ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 

మరోవైపు, వాట్సాప్‌ వెబ్ వర్షన్ వినియోగదారులు తమకు నచ్చిన చాట్స్‌ను ఇతరులకు కనబడకుండా దాచుకునేలా ఓ కొత్త ఫీచర్‌ను వాట్సాప్ టెస్టు చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమకు నచ్చిన చాట్‌లకు ఓ పాస్‌వర్డ్‌తో ఎవరికీ కనబడకుండా లాక్ చేసుకోవచ్చు.

More Telugu News