Shamshabad Airport Smart Trolley: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులోని స్మార్ట్ ట్రాలీని చూసి పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఆశ్చర్యం!

Smart Trolleys At Hyderabad Airport Harsh Goenka Praises Indias Tech Leap

  • జీఎం‌ఆర్ ఎయిర్‌పోర్టులోని స్మార్ట్ ట్రాలీ వీడియోను షేర్ చేసిన ఆర్‌పీజీ గ్రూప్ అధినేత
  • ఇలాంటి ట్రాలీలను ప్రపంచంలో ఎక్కడా చూడలేదని కామెంట్
  • భారత్‌లోని సాంకేతికాభివృద్ధిపై ఆశ్చర్యం

హైదరాబాద్‌లోని జీఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులోగల లగేజ్ తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన అత్యాధునిక ట్రాలీలు ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకాను ఆశ్చర్యపరిచాయి. ప్రపంచంలో మరే ఎయిర్‌పోర్టులోనూ కనిపించని ఈ స్మార్ట్ ట్రాలీపై ఆయన ప్రశంసలు కురిపించారు. భారత్‌లో సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోందని కామెంట్ చేశారు. ‘‘మన దేశం ఇలా స్మార్ట్‌గా మారడం చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది. అభివృద్ధి చెందిన దేశాల్లోని ఎయిర్‌పోర్టుల్లో ఇలాంటి ట్రాలీలను నేను చూడలేదు’’ అని ఆయన కామెంట్ చేశారు. ఈ ట్రాలీపై ఓ నెటిజన్ చేసిన వీడియోను కూడా షేర్ చేశారు. 

ఈ స్మార్ట్ ట్రాలీలో ఓ ట్యాబ్ ఉంటుంది. ప్రయాణికులు ఈ ట్యాబ్ సాయంతో తన బోర్డింగ్ పాస్ స్కాన్ చేయగానే వారి ఫ్లైట్ తాలూకు వివరాలన్నీ చెప్పేస్తుంది. విమానం బయలుదేరే సమయం, గేట్ నెంబర్‌తో పాటు ఎయిర్‌పోర్టులో ఎక్కడెక్కడ రెస్టారెంట్లు ఉన్నాయో స్క్రీన్‌పై చూపెడుతుంది. అంతేకాకుండా, ఎయిర్‌పోర్టులో మనం ఎక్కడున్నదీ చూడా చెప్పేస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది ఎయిర్‌పోర్టులోని వారికి జీపీఎస్ మ్యాప్ లాగా ఉపయోగపడుతుంది. 

ఇక హర్ష్ గోయెంకా ట్వీట్‌పై జీఎంఆర్ ఎయిర్‌పోర్టు స్పందించింది. ప్రయాణికుల జర్నీ మరింత సులభతరం చేసేందుకు తాము నిరంతరంగా కృషి చేస్తున్నామని వెల్లడించింది.

More Telugu News