Police Thieves: నడి వీధిలో దొంగలకు, పోలీసులకు మధ్య ఫైట్.. వీడియో ఇదిగో!

Cops Throw Punches In Clash With Thieves Near Ajmer Dargah

  • పట్టుకోవాలని పోలీసులు.. పారిపోయేందుకు దొంగల పెనుగులాట
  • ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించుకున్న వైనం
  • రాజస్థాన్ లోని అజ్మీర్ దర్గా సమీపంలో గొడవ.. వీడియో వైరల్

రాజస్థాన్ లోని అజ్మీర్ దర్గా సమీపంలో మంగళవారం రాత్రి హైడ్రామా జరిగింది. నడి వీధిలో దొంగ, పోలీసులు కలబడ్డారు. ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. దొంగలను పట్టుకోవాలని పోలీసులు.. పోలీసుల నుంచి తప్పించుకోవాలని దొంగలు విశ్వప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఛేజింగ్ లు, కాల్పులు, వీధి పోరాటం.. ఇలా సినిమాను తలపించే సన్నివేశం చోటుచేసుకుంది. ఇదంతా అక్కడున్న జనం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్ గా మారింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో బంగారం చోరీ చేసి తప్పించుకు తిరుగుతున్న దొంగలు హెహజాద్, సాజిద్ రాజస్థాన్ లోని అజ్మీర్ లో ఉన్నారని సమాచారం అందింది. దీంతో కేరళ నుంచి ఓ టీమ్ అజ్మీర్ కు చేరుకుంది. స్థానిక పోలీసులతో కలిసి దర్గాలో తనిఖీ చేపట్టింది. అయితే, జనాలు ఎక్కువగా ఉండడంతో పోలీసుల తనిఖీ సందర్భంగా తోపులాట జరిగింది. జనాలు భయంతో పరుగులు పెట్టడంతో దొంగలు కూడా వారిలో కలిసిపోయి అక్కడి నుంచి తప్పించుకున్నారు. పారిపోతున్న దొంగలను పట్టుకోవడానికి కేరళ పోలీసులు వెంటపడ్డారు. ఈ ఛేజింగ్ లో పోలీసులపైకి దొంగలు కాల్పులు కూడా జరిపారు.

చివరకు ఓ ఇరుకు సందులో దొంగలను పట్టుకున్న పోలీసులు.. చేతులకు బేడీలు వేసేందుకు ప్రయత్నించగా దొంగలు ఎదురుతిరిగారు. ఎలాగైనా తప్పించుకు పారిపోవాలనే ఉద్దేశంతో పోలీసులపై దాడి చేశారు. ఈ క్రమంలో పోలీసులు, దొంగల మధ్య వీధి పోరాటం చోటుచేసుకుంది. ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఎట్టకేలకు మిగతా పోలీసు సిబ్బంది సాయంతో దొంగలు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ ఫైటింగ్ సీన్ ను అక్కడున్న జనం వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది.

Police Thieves
Street fight
Ajmer Dargah
Rajasthan
kerala police
Gold Theft

More Telugu News