Dharani: ధరణిని మార్చేసి కొత్త పోర్టల్ తీసుకొస్తామన్న మంత్రి
- హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి
- ధరణి కారణంగా రైతులకు సమస్యలు.. ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం
- తప్పుడు పత్రాలతో సర్కారు భూములను పట్టా చేసుకున్నారని ఆరోపణ
ధరణి పోర్టల్ వల్ల రైతులు చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. తమ భూమి పాత యజమానుల పేర్లతో నమోదైందని అధికారుల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. దీనికి సంబంధించి ఒక్కో జిల్లాలో వేల సంఖ్యలో ఫిర్యాదులు నమోదయ్యాయని వివరించారు. సర్వే నెంబర్లలో మార్పులు చేసి కొంతమంది సర్కారు భూములను కాజేశారని ఆరోపించారు. రూ. కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయని తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఖైరతాబాద్ లో జరిగిన రంగారెడ్డి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొని, ప్రసంగించారు.
ధరణి సమస్యలను తొలగించేందుకు త్వరలోనే కొత్త పోర్టల్ ను తీసుకొస్తామని చెప్పారు. దీనికోసం వేగంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ భూమిని కాజేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. సర్కారు భూములను సొంతం చేసుకున్నవారితో పాటు వారికి హక్కులు కల్పించిన అధికారులు, సిబ్బందిపైనా చర్యలు తప్పవన్నారు. ఒకే సర్వే నంబరులో పార్ట్-బి పేరుతో ఉన్న భూములపై విచారణ జరిపి తగిన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.