Telugudesam: టీడీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు

Ex MLA Muddaraboyina resigns to TDP

  • నూజివీడు నియోజకవర్గ ఇన్ఛార్జీగా పార్థసారథిని నియమించిన చంద్రబాబు
  • పదేళ్లు తనను వాడుకుని వదిలేశారన్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావు
  • వైసీపీలో చేరుతానని తాను చెప్పలేదు కదా అని వ్యాఖ్య

ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ప్రధాన పార్టీల్లో అసంతృప్తులు పెరిగిపోతున్నారు. టికెట్ దక్కని నేతలు మరో ఆలోచనకు తావివ్వకుండా పార్టీలకు రాజీనామా చేస్తున్నారు. తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పార్టీకి రాజీనామా చేశారు. నూజివీడు నియోజకవర్గ ఇన్ఛార్జీగా కొలుసు పార్థసారథిని చంద్రబాబు నియమించిన సంగతి తెలిసిందే. దీంతో, అసంతృప్తికి గురైన ముద్దరబోయిన పార్టీకి రాజీనామా చేశారు. తన కార్యాలయంలో ఉన్న టీడీపీ ఫ్లెక్సీలను కూడా ఆయన తొలగించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మీకు, మీ పార్టీకి ఒక నమస్కారం అని చెప్పారు. పార్థసారథి ఇంకా టీడీపీ కండువా కూడా కప్పుకోలేదని... కానీ, ఆయనను నూజివీడు ఇన్ఛార్జీగా ప్రకటించారని మండిపడ్డారు. ఉరిశిక్ష వేసే ముందు కూడా చివరి కోరిక అడుగుతారని... కానీ, తనను పార్టీ ఏమీ అడగలేదని వాపోయారు. వైసీపీలో చేరానని తానేమైనా చెప్పానా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో జగన్ ను కలిసి పలు అంశాలపై చర్చించానని... సీఎంను ఎవరైనా కలవొచ్చు కదా? అని అన్నారు. పదేళ్లు తనను వాడుకుని ఇప్పుడు వదిలేశారని విమర్శించారు. త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు.

More Telugu News