Trisha: రూ. 25 లక్షలు ఇచ్చి తనను రిసార్ట్ కు పిలిపించుకున్నారనే వ్యాఖ్యలపై త్రిష స్పందన
- అన్నాడీఎంకే నేత ఏవీ రాజు వివాదాస్పద వ్యాఖ్యలు
- వైరల్ అవుతున్న వీడియో క్లిప్పింగ్
- మండిపడుతున్న సినీ ప్రముఖులు
ప్రముఖ హీరోయిన్ త్రిష ఇటీవలి కాలంలో హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. ఇటీవల ఆమెపై నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. త్రిషను రేప్ చేసే సీన్ సినిమాలో లేకపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వివాదం కోర్టు వరకు వెళ్లింది. ఇప్పుడు త్రిష మరోసారి వార్తల్లోకి ఎక్కింది.
అన్నాడీఎంకే పార్టీకి చెందిన నేత ఏవీ రాజు ఆమెను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక రాజకీయ నాయకుడు రూ. 25 లక్షలు ఇచ్చి త్రిషను రిసార్ట్ కు పిలిపించుకున్నారని ఆయన చెపుతున్నట్టు వీడియో క్లిప్ లో ఉంది. ఈ వీడియో ఇప్పుడు తమిళనాట రచ్చ అవుతోంది. ఏవీ రాజాపై తమిళ సినీ ప్రముఖులతో పాటు, పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాజును అన్నాడీఎంకే నాయకత్వం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
దీనిపై త్రిష స్పందిస్తూ... ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ఎంతకైనా దిగజారే నీచమైన వ్యక్తులను పదేపదే చూడటం అసహ్యంగా ఉందని ఎక్స్ వేదికగా మండిపడింది. ఇలాంటి వారిని ఉపేక్షించనని... కఠిన చర్యలు తీసుకుంటానని తెలిపింది. అంతా తన లీగల్ టీమ్ చూసుకుంటుందని చెప్పింది.