Alla Ramakrishna Reddy: తాను మళ్లీ వైసీపీలోకి రావడానికి గల కారణాన్ని వెల్లడించిన ఆర్కే
- ఇటీవల వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఆర్కే
- మళ్లీ పాతగూటికి తిరిగొచ్చిన వైనం
- నేడు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి పునరాగమనం
మళ్లీ వైసీపీ గూటికి చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఎం జగన్ ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఓడించాలని అన్ని పార్టీలు ఎలా ఏకం అయ్యాయో, ఇప్పుడు జగన్ ను ఓడించడానికి కూడా పార్టీలు ఏకం అయ్యాయని... అది జరగకూడదన్న ఉద్దేశంతోనే మళ్లీ వైసీపీలోకి వచ్చానని ఆర్కే వివరణ ఇచ్చారు.
పేదవాడు గొప్పవాడు కావాలి... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు రాజకీయంగా ఆర్థికంగా ముందుకు వెళ్లాలి... ఆ దిశగా అడుగులు వేస్తున్న జగన్ కు అండగా నిలవాలన్న ఉద్దేశంతోనే వైసీపీలోకి తిరిగొచ్చానని చెప్పారు.
ఈసారి మంగళగిరి సీటు బీసీలకు ఇస్తున్నారని ఆర్కే సూచనప్రాయంగా తెలిపారు. మంగళగిరిలో లోకేశ్ 2019లో ఓసీ చేతిలో ఓడిపోయారని, ఈసారి బీసీ చేతిలో లోకేశ్ ఓడిపోబోతున్నాడని ఆర్కే వ్యాఖ్యానించారు.
'అన్నా, మంగళగిరిలో మీరు ఏ అభ్యర్థిని నిలబెట్టినా, ఆ అభ్యర్థి కోసం పూర్తిస్థాయిలో, బేషరతుగా కృషి చేస్తాను' అని సీఎం జగన్ తో చెప్పానని వెల్లడించారు. మంగళగిరిలో వరుసగా మూడోసారి వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు పాటుపడతానని చెప్పానని వివరించారు.
ఏ ఏ నియోజకవర్గాల్లో తన సేవలు అవసరమవుతాయో పార్టీ సమన్వయకర్తలు నిర్ణయిస్తారని, దాన్ని బట్టి తాను ఆయా నియోజకవర్గాల్లో సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. జగన్ మరో 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని, ఈసారి ఎన్నికల్లో వైసీపీ 175కి 175 గెలవాలని ఆకాంక్షిస్తున్నట్టు వెల్లడించారు.