Jagan: కల్యాణమస్తు, షాదీ తోఫా నిధులను విడుదల చేసిన సీఎం జగన్
- రూ. 78.52 కోట్ల నిధులను విడుదల చేసిన జగన్
- దేవుడి దయవల్ల ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతోందన్న సీఎం
- చదువును ప్రోత్సహించే క్రమంలో వరుడు, వధువు ఇద్దరూ పదో తరగతి చదివి ఉండాలనే నిబంధన పెట్టామన్న జగన్
వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా ఐదో విడత నిధులను ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. బటన్ నొక్కి తల్లుల ఖాతాల్లోకి నిధులను జమ చేశారు. అక్టోబరు-డిసెంబరు 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,132 జంటలకు వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా క్రింద రూ.78.53 కోట్ల ఆర్థిక సాయం చేశారు. వధువుల తల్లుల ఖాతాల్లో డబ్బు జమ చేశారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... దేవుడి దయవల్ల ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతోందని చెప్పారు. పేద పిల్లల చదువులను ప్రోత్సహించే క్రమంలో వరుడు, వధువు ఇద్దరూ కూడా పదో తరగతి చదివి ఉండాలనే నిబంధన విధించామని చెప్పారు. మన తలరాత, భవిష్యత్తు మార్చే శక్తి చదువుకు ఉందని అన్నారు. మన తలరాతలు మార్చే ఆస్తి మన చేతిలోనే ఉందని చెప్పారు. పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి, వారి వివాహాలను గౌరవప్రదంగా జరిపించేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని జగన్ అన్నారు.