YNRK-HWH Express Rail: రిజర్వేషన్ చేసుకున్న బెర్త్‌ను ఆక్రమించిన మరో కుటుంబం.. ఎక్స్‌లో ఫొటోలు పెట్టి ఆర్‌పీఎఫ్‌ను రప్పించిన మహిళ!
- వైఎన్ఆర్‌కే-హెచ్‌డబ్ల్యూహెచ్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఘటన
- తన సోదరి సీటును మరో కుటుంబం ఆక్రమించిందంటూ ఫొటోలు, వీడియోలు షేర్ చేసిన మహిళ
- 20 నిమిషాల తర్వాత సీటును ఖాళీ చేయించిన ఆర్‌పీఎఫ్
రైలు ప్రయాణం చేసే వారికి ఇలాంటి అనుభవం ఒకసారైనా ఎదురై ఉంటుంది. మనం రిజర్వేషన్ చేసుకున్న సీట్లో మరొకరు ప్రయాణించడమనేది ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. అవతలి వారు కాస్తంత మర్యాదస్తులైతే మనం రాగానే సీటు ఖాళీ చేస్తారు. లేదంటే వారు హాయిగా కూర్చుంటే మనం ఆపసోపాలు పడి ప్రయాణించాల్సి వస్తుంది. యోగ్‌నగరి రిషికేషన్ నుంచి హౌరా (వైఎన్ఆర్‌కే-హెచ్‌డబ్ల్యూహెచ్) వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆమెను డ్రాప్ చేయడానికి వచ్చిన సోదరి మాత్రం ఈ విషయాన్ని అక్కడితో వదిలేయాలని అనుకోలేదు. వెంటనే ఆమె తన ఎక్స్ ఖాతాలో ఈ విషయాన్ని వీడియోలు, ఫొటోలతోపాటు తన సోదరి టికెట్‌ను షేర్ చేసి విషయం చెప్పింది.
తన సోదరి రిజర్వేషన్ చేసుకున్న టికెట్ చివరి నిమిషంలో కన్ఫామ్ అయిందని పేర్కొన్న ఆమె.. రైలు మూడు గంటలు ఆలస్యంగా వచ్చిందని పేర్కొంది. తన చెల్లెలు తొలిసారి ఒంటరిగా ప్రయాణిస్తోందని, రైలులోని ఆమె సీటును మరో ఫ్యామిలీ ఆక్రమించిందని పేర్కొంది. సీటు ఖాళీ చేయాలని కోరితే తిరస్కరించిన అంకుల్.. పైకెళ్లి కూర్చోమన్నాడని చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది.
ఎక్స్‌లో ఆమె పంచుకున్న ఆవేదనకు స్పందించిన నెటిజన్లు ‘రైల్వే మదద్’, ‘రైల్వేసేవ’ వంటి వాటిని సంప్రదించాలని సూచించారు. చివరికి రంగంలోకి దిగిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) అధికారులు సమస్యను పరిష్కరించారు. దీంతో 20 నిమిషాల తర్వాత ప్రయాణికురాలి సీటు ఆమెకు లభించింది. సకాలంలో స్పందించిన రైల్వేకు ప్రయాణికురాలితోపాటు ఆమె సోదరి కృతజ్ఞతలు తెలిపింది.