Samantha: అలా అనుకున్నందుకు ఇప్పుడు గిల్టీగా ఫీలవుతున్నా: సమంత

Samantha Released First Episode Of Her Health Podcost
  • హెల్త్ పాడ్ కాస్ట్ లో మాట్లాడిన నటి
  • ‘టేక్ 20’ తొలి ఎపిసోడ్ విడుదల
  • న్యూట్రిషనిస్ట్ తో సమంత సంభాషణ
ప్రముఖ నటి సమంత ఇటీవల ప్రారంభించిన ‘టేక్ 20’ హెల్త్ పాడ్ కాస్ట్ నుంచి తొలి ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈ పాడ్ కాస్ట్ లో సమంత ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అల్కేశ్ తో జరిపిన సంభాషణను విడుదల చేశారు. మయోసైటిస్ నుంచి కోలుకుంటున్న క్రమంలో తన అనుభవాలను పంచుకోవడం, మయోసైటిస్ తో పాటు వివిధ అనారోగ్యాలపై జనాలలో అవగాహన కల్పించడం కోసం సమంత ఈ హెల్త్ పాడ్ కాస్ట్ ను ప్రారంభించారు. ఎంతో రీసెర్చ్‌ చేసి, అనుభవజ్ఞుల సలహాలు, సూచనలతో ఈ కంటెంట్ ను అందిస్తున్నట్లు సమంత చెప్పారు. తాజా ఎపిసోడ్ లో న్యూట్రిషనిస్ట్ అల్కేశ్ ను సమంత పలు ప్రశ్నలు అడిగి, జవాబులు రాబట్టారు.

సమంత: ఆటో ఇమ్యూనిటీ గురించి చెప్పండి..

అల్కేశ్‌: ఇదొక వ్యాధి అని చాలామంది అభిప్రాయం. కానీ అది తప్పు. మన శరీరంలో రోగాలను అడ్డుకునేందుకు సహజ వ్యాధి నిరోధక వ్యవస్థ ఉంటుంది. ఈ వ్యవస్థే మన శరీరంపై దాడి చేయడాన్ని ఆటో ఇమ్యూనిటీ అంటారు. అయితే, ఇది చాలా ప్రత్యేక సందర్భాలలో మాత్రమే ఎదురయ్యే సమస్య.

సమంత: షుగర్‌, క్యాన్సర్‌, గుండె సంబంధిత అనారోగ్యాలతో బాధపడుతున్న వారిలోనే ఎక్కువగా ఆటో ఇమ్యూనిటీ సమస్య కనిపిస్తోంది. ఎందుకు?

అల్కేశ్‌: ఆహారం, గాలి, దుస్తులు, సౌందర్యోపకరణాలు.. ఇలా ఏవైనా ప్రభావితం చేయొచ్చు. ప్రధానంగా ఆధునిక జీవనశైలిని కారణంగా చెప్పవచ్చు.

సమంత: గతంలో నేను మంచి ఆహారం తింటున్నా, చాలా ఆరోగ్యంగా ఉన్నా, రోగాలు నా దరికి చేరవని అనుకునేదానిని.. నాలాగే చాలామంది ఇప్పటికీ అనుకుంటుంటారు. అలా అనుకున్నందుకు ఇప్పుడు గిల్టీగా ఫీలవుతున్నా. రోజూ ఉదయాన్నే లేచి వర్కౌట్స్ చేస్తూ, ఆరోగ్యకరమైన తిండి తింటూ, హాయిగా నవ్వుతూ ఉండేదానిని.. అయినా అనారోగ్యం పాలయ్యాను. కారణం ఒత్తిడేనా?

అల్కేశ్‌: ఆటో ఇమ్యూన్ కు తీవ్ర ఒత్తిడి, ఆహారపు అలవాట్లు కూడా కారణమే. ఒత్తిడిని జయించేందుకు శరీరానికి మంచి నిద్ర అవసరం. సరిగా నిద్రించకపోవడం వల్ల తాత్కాలికంగా ప్రభావం కనిపించకపోవచ్చు కానీ దీర్ఘకాలంలో తప్పకుండా దాని ప్రభావం మన శరీరంపై పడుతుంది.

సమంత: ఆటో ఇమ్యూన్ సమస్యను అధిగమించేందుకు మీరిచ్చే సూచనలేంటి?

అల్కేశ్‌: తాజా ఆహారం, పరిశుభ్రమైన నీరు, కాస్మోటిక్స్‌ వాడకంపై జాగ్రత్తతో పాటు ఒత్తిడిని జయించేలా జీవనశైలిని మార్చుకోవాలి.
Samantha
Health Podcost
Auto Immunity
Food Habits
Nutritionist
Alkesh
Take 20

More Telugu News