Russian pilot: సైన్యాన్ని మోసంచేసి పారిపోయిన రష్యా పైలట్.. స్పెయిన్ లో దారుణ హత్య
- బుల్లెట్ గాయాలతో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు
- ఉక్రెయిన్ తో చేతులు కలిపిన రష్యన్ పైలట్
- గతేడాది రష్యన్ హెలికాఫ్టర్ తో ఉక్రెయిన్ లో ల్యాండింగ్
- పైలట్ ను తుదముట్టించాలని రష్యా సైన్యం స్టాండింగ్ ఆర్డర్
రష్యా సైన్యాన్ని మోసం చేసి పారిపోయిన పైలట్ ఒకరు స్పెయిన్ లో దారుణ హత్యకు గురయ్యాడు. బుల్లెట్ గాయాలతో పడి ఉన్న పైలట్ మృతదేహాన్ని స్పెయిన్ పోలీసులు గుర్తించారు. మారుపేరుతో, ఉక్రెయిన్ పాస్ పోర్టుతో ఆ వ్యక్తి ఆశ్రయం పొందాడని విచారణలో తేలింది. వారం క్రితం గుర్తించిన ఈ మృతదేహం రష్యన్ పైలట్ మాక్సిమ్ కుజుమినోవ్ దేనని తెలుస్తోంది. ఈమేరకు స్పెయిన్ అధికారిక న్యూస్ ఏజెన్సీ ఈఎఫ్ఈ ఓ కథనం ప్రసారం చేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 13న విల్లాజోయోసా అనే చిన్న టౌన్ లో కుజుమినోవ్ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు కుజుమినోవ్ పై 12 రౌండ్ల కాల్పులు జరిపారని పేర్కొన్నారు. ఈ హత్యపై విచారణ జరుపుతున్నామని, హంతకులను గుర్తించే ప్రయత్నంలో ఉన్నామని పోలీసులు వివరించారు.
ఎవరీ కుజుమినోవ్..
మాక్సిమ్ కుజుమినోవ్ రష్యా మిలటరీలో పైలట్.. ఆర్మీకి చెందిన హెలికాఫ్టర్ ను నడుపుతుండేవాడు. తన విధుల్లో భాగంగా గతేడాది ఆగస్టులో యుద్ధ విమానాల విడి భాగాలను రష్యా మిలటరీ బేస్ లకు చేర్చేందుకు బయలుదేరాడు. హెలికాఫ్టర్ లో కుజుమినోవ్ తో పాటు మరో ఇద్దరు సైనికులు ఉన్నారు. ఆర్మీ బేస్ నుంచి గాల్లోకి ఎగిరిన తర్వాత కుజుమినోవ్.. ఆర్మీ బేస్ లో కాకుండా ఉక్రెయిన్ భూభాగంలో హెలికాఫ్టర్ ను దింపాడు. ఉక్రెయిన్ తో చేతులు కలిపి రష్యా ఆర్మీని మోసం చేశాడు.
యుద్ధ విమానాల విడిభాగాలను ఉక్రెయిన్ ఆర్మీకి అప్పగించాడు. ఆ తర్వాత స్పెయిన్ పారిపోయి, మారుపేరుతో ఉక్రెయిన్ వీసాతో రహస్య జీవితం గడుపుతున్నాడు. ఈ మోసాన్ని తీవ్రంగా పరిగణించిన రష్యా మిలటరీ ఇంటలిజెన్స్ ఏజెన్సీ ‘జీఆర్ యూ’.. కుజుమినోవ్ ను తుదముట్టించేందుకు స్టాండింగ్ ఆర్డర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా స్పెయిన్ లో కుజుమినోవ్ ను గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు.