Revanth Reddy: మూసీ నదిలో నిరంతరం మంచి నీరు పారాలి.. నదిని సహజత్వం ఉట్టిపడేలా చేయాలి: రేవంత్ రెడ్డి

Fresh water has to flow in Musi says Revanth Reddy
  • మూసీ నది ప్రక్షాళనపై రేవంత్ సమీక్ష
  • భవిష్యత్తులో మూసీలో చుక్క మురుగునీరు కూడా కలవకూడదని సూచన
  • నది ఆక్రమణలను గుర్తించి, తొలగించాలని ఆదేశం
హైదరాబాద్ లోని మూసీ నది సమూలంగా ప్రక్షాళన చేయాలన్న సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. నది మొత్తం సహజత్వం ఉట్టిపడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిరంతరం మూసీ నదిలో మంచి నీరు పారించడం కీలకమని చెప్పారు. నదికి ఇరువైపుల ఉన్న ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా చేయాలని సూచించారు. మూసీ నది పరీవాహక ప్రాంత అభివృద్ధి ప్రక్రియలపై హెచ్ఎండీఏ కార్యాలయంలో నిన్న రేవంత్ సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా మూసీ సరిహద్దు ప్రాంత స్కెచ్ తో పాటు, పూర్తి వివరాలను రేవంత్ కు అధికారులు వివరించారు. నదీ గర్భంలోని వ్యర్థాల తొలగింపు, హద్దులను పక్కాగా గుర్తించడం, ఇతరత్రా పనుల గురించి సీఎంకు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... తొలుత మూసీ శుభ్రత ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచించాలని సూచించారు. ఇందులో భాగంగా నదిలో నిరంతరం మంచి నీటిని ప్రవహింపజేయడం ముఖ్యమని అన్నారు. భవిష్యత్తులో మూసీలో చుక్క మురుగునీరు కూడా కలవకుండా చూడాలని చెప్పారు. నీటిశుద్ధి కేంద్రాల ద్వారా వస్తున్న నీటినే మూసీలోకి వదలాలని అన్నారు. ఎగువ నుంచి నదిలోకి మంచి నీళ్లు వచ్చే రివర్ లింక్డ్ ప్రాజెక్టులపై దృష్టి సారించాలని చెప్పారు. 

నది పరీవాహక ప్రాంతలోని ఆక్రమణలను గుర్తించాలని, అక్కడ నివసిస్తున్న కుటుంబాలను గుర్తించేందుకు అదనపు సిబ్బందిని నియమించాలని రేవంత్ సూచించారు. ఎక్కడెక్కడ, ఎంతమేర వ్యర్థాలున్నాయో గుర్తించాలని, వీటి కోసం అవసరమైతే డ్రోన్లతో సర్వే చేపట్టాలని అన్నారు. నిర్వాసితులకు పునరావాసం, ఆక్రమణల తొలగింపుపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని చెప్పారు. మూసీని ఆహ్లాదకరమైన ఉద్యానంగా, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేద్దామని తెలిపారు. త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Revanth Reddy
Congress
Musi River
Hyderabad

More Telugu News