Chalo Delhi: రైతుల ‘ఛలో ఢిల్లీ’ మళ్లీ మొదటికి.. కేంద్రం ప్రతిపాదన తిరస్కరణ

farmers Rejected Centres proposal on MSP and Chalo Delhi will resume from Wednesday

  • 5 ఏళ్లపాటు కొన్ని పంటలను కనీస మద్దతు ధరకు కొంటామన్న కేంద్రం
  • రెండు మూడు పంటలకే వర్తింపజేయడం సబబు కాదన్న రైతులు 
  • బుధవారం నుంచి ‘ఛలో ఢిల్లీ’ పున:ప్రారంభిస్తామని ప్రకటన
  • కీలక ప్రకటన చేసిన రైతు సంఘాల నాయకులు

రైతులు తలపెట్టిన ‘ఛలో ఢిల్లీ’ మళ్లీ మొదటికి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. అన్నదాతలు  అంగీకారం తెలిపితే మొక్కజొన్న, పత్తి, మూడు రకాల పప్పు దినుసులను ఐదేళ్లపాటు కనీస మద్దతు ధరతో కొనుగోలు చేస్తామంటూ కేంద్రం చేసిన ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించాయి. ఈ మేరకు రైతు సంఘాల నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ సోమవారం పొద్దుపోయాక కీలక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర మంత్రుల బృందం చేసిన ప్రతిపాదన తమకు ఆమోదయోగ్యంగా లేదని తెలిపారు. రైతులు బుధవారం నుంచి తిరిగి నిరసన కొనసాగించనున్నారని, శాంతియుతంగా ఢిల్లీ వైపు మార్చ్‌ను మొదలుపెడతారని చెప్పారు. పంజాబ్, హర్యానా సరిహద్దులోని శంభులో రైతు సంఘాల మధ్య చర్చల అనంతరం పంధేర్ ఈ ప్రకటన విడుదల చేశారు. 

ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను తాము పూర్తిగా పరిశీలించామని, కనీస మద్దతు ధరను కేవలం రెండు మూడు పంటలకు మాత్రమే వర్తింపజేయడం సమంజసం కాదని మరో రైతు సంఘం నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లేవాల్ పేర్కొన్నారు. ఇతర పంటలు పండించే రైతులకు కేంద్రం చేసిన ప్రతిపాదన వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు. పప్పు దినుసులపై కనీస మద్దతు ధరకు హామీ ఇస్తే రూ.1.5 లక్షల కోట్ల అదనపు భారం పడుతుందని కేంద్ర మంత్రి అన్నారని, అయితే వ్యవసాయ పంటల ధర కమిషన్ మాజీ ఛైర్మన్ ప్రకాష్ కమ్మర్డి అధ్యయనం ప్రకారం అన్ని పంటలకు ఎంఎస్‌పీ వర్తింపజేస్తే మొత్తం వ్యయం రూ.1.75 లక్షల కోట్లు అవుతుందని జగ్జిత్ సింగ్ దల్లేవాల్ పేర్కొన్నారు. దేశంలోకి పామాయిల్‌ దిగుమతి కోసం ప్రభుత్వం ఏకంగా రూ.1.75 లక్షల కోట్లు వెచ్చిస్తోందని, ఇది ప్రజల ఆరోగ్యానికి హానికరమని ఆయన అన్నారు. అదే మొత్తాన్ని రైతులు నూనెగింజలు పండించడంలో సాయం చేయవచ్చునని సూచించారు.

పంటల వైవిధ్యాన్ని ఎంచుకునే రైతులకు మాత్రమే ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వాలని భావిస్తోందని, ఎంఎస్పీ కింద హామీ ఉన్న పంటలను మాత్రమే పండించాలనే ప్రయత్నం చేస్తోందని దల్లేవాల్ ఆరోపించారు. ఇప్పటికే సాగు చేస్తున్న పంటలకు కనీస మద్దతు ధర వర్తింపజేయాలని అన్నారు. కొన్ని పంటలకు మాత్రమే ఎంఎస్‌పీ ఇస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని, మొత్తం 23 పంటలకు వర్తింపజేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కనీస మద్దతుతో ఆదాయం పెరగదని, రైతుల జీవనోపాధికి అక్కరకొస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. చట్టబద్ధమైన హామీ లేకుంటే రైతులు నష్టపోతారని, ఈ కారణంగానే తాము ప్రతిపాదనను తిరస్కరించాలని నిర్ణయించామని వివరించారు. కాగా ప్రస్తుత నిరసనల్లో భాగంగా లేని ‘కిసాన్ మోర్చా’ ప్రభుత్వ ప్రతిపాదనపై విమర్శలు గుప్పించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ ప్రకటన వెలువడడం గమనార్హం.

  • Loading...

More Telugu News