Medaram Jatara: మేడారం జాతర రోజుల్లో హైదరాబాదు నగరంలో తిరిగేవి తక్కువ బస్సులే!
- ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు మేడారం జాతర
- హైదరాబాద్ పరిధిలోని 2850 బస్సుల్లో 2000 మేడారంకు కేటాయింపు
- హైదరాబాద్‌లో అందుబాటులో ఉండే బస్సులు 850 మాత్రమే
హైదరాబాద్ నగరంలో తరుచూ మీరు బస్సుల్లో ప్రయాణిస్తుంటారా? లేదా ఈ నెల 24వ తేదీ వరకు బస్సుల్లో తిరిగే పనులు ఉన్నాయా? అయితే ఇది మీకోసమే! మేడారం జాతర పూర్తయ్యే వరకు కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సిందే! ఈ నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు మేడారం జాతర సందర్భంగా నగరానికి చెందిన పలు ఆర్టీసీ బస్సులను మేడారంకు కేటాయించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2850 బస్సులు తిరుగుతున్నాయి. అయితే ఇందులో 2 వేల బస్సులను ఎల్లుండి నుంచి మేడారం జాతరకు కేటాయించారు. ఇప్పటికే కొన్ని బస్సులను కేటాయించగా.. మరికొన్నింటిని జాతర సమయంలో కేటాయిస్తున్నారు.
నగరం నుంచి మేడారంకు కేటాయించే 2000 బస్సుల్లో 250 హైదరాబాద్ నగరం నుంచి మేడారం జాతరకు వెళ్లనుండగా.. మిగతావి ఇతర ప్రాంతాల నుంచి వెళతాయి. దీంతో 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నగరంలో బస్సుల్లో ప్రయాణించడం కష్టమే. మహాలక్ష్మి పేరుతో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ పథకం కింద నగరంలో తిరిగే మహిళల సంఖ్య 18 లక్షల వరకు ఉంది. ఇలాంటి తరుణంలో మేడారం జాతరకు ఎక్కువ బస్సులు వెళుతున్నాయి. మేడారం జాతర రోజుల్లో నగరంలో 2850 బస్సులకు గాను కేవలం 850 మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి ఈ రోజుల్లో ఎక్కువమంది ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.