mekala kavya: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ మేయర్ మేకల కావ్యపై నెగ్గిన అవిశ్వాసం
- కొంతమంది కార్పోరేటర్లు తమ స్వలాభం కోసం అవిశ్వాసం పెట్టారన్న మేకల కావ్య
- 27 మంది కార్పోరేటర్లలో మేయర్‌కు వ్యతిరేకంగా 20 మంది ఓటు
- త్వరలో కొత్త మేయర్‌ను ఎన్నుకునే అవకాశం
తనపై అకారణంగా అవిశ్వాసం పెట్టారని, అసమ్మతి వర్గంలోని కొంతమంది తమ స్వలాభం కోసం ఈ పని చేశారని మేయర్ అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయిన బీఆర్ఎస్ నాయకురాలు, మేయర్ మేకల కావ్య ఆవేదన వ్యక్తం చేశారు. అసమ్మతి వర్గంలో భూకబ్జాదారులు ఉన్నారని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ మేయర్ మేకల కావ్యపై అసమ్మతి వర్గం అవిశ్వాస తీర్మానం పెట్టింది. జవహర్ నగర్ నగర పాలక సంస్థలో మేయర్ సహా 28 మంది కార్పోరేటర్లు ఉన్నారు. సోమవారం ఓటింగ్ నిర్వహించగా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 20 మంది ఓటు వేశారు. మేకల కావ్యకు అనుకూలంగా కేవలం నాలుగు ఓట్లు మాత్రమే వచ్చాయని తెలుస్తోంది.
మొత్తం 28 మంది కార్పోరేటర్లు ఉండగా గతంలో అనారోగ్యంతో 16వ డివిజన్ కార్పోరేటర్ మృతి చెందారు. దీంతో 27 ఓట్లకు గాను మేకల కావ్యకు వ్యతిరేకంగా 20 ఓట్లు పడ్డాయి. మేయర్ మేకల కావ్యపై అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లు ఆర్డీవో ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వివరాలను మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌కు అందజేయనున్నట్లు తెలిపారు. ఓటింగ్ సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జవహర్ నగర్ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. అవిశ్వాసం నెగ్గడంతో మేయర్ కావ్య కార్పోరేషన్ కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోయారు. కాగా, త్వరలో కొత్త మేయర్‌ను ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.