Navalny: నావల్నీ మృతదేహం అప్పగింత వెనక కొనసాగుతున్న హైడ్రామా
- కుటుంబ సభ్యులకు అప్పగించని ప్రభుత్వం
- కొడుకు మృతదేహం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్న నావల్నీ తల్లి
- సంతాపం తెలిపిన వారిని నిర్భంధించిన పోలీసులు
రష్యా ప్రతిపక్ష నేత, పుతిన్ విమర్శకుడు అలెక్సీ నావల్నీ మృతదేహం ఎక్కడుందనే విషయంపై సస్పెన్స్ నెలకొంది. ఆయన చనిపోయారని ప్రకటించి మూడు రోజులు కావొస్తున్నా ఇప్పటికీ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించలేదు. కొడుకు చనిపోయాడనే విషయం తెలిసిన వెంటనే నావల్నీ తల్లి ఆర్కిటిక్ కాలనీ జైలుకు వెళ్లింది. లాయర్ ను వెంటపెట్టుకుని వెళ్లి కొడుకు డెడ్ బాడీ అప్పగించాలని కోరగా.. పోస్ట్ మార్టం కోసం దగ్గర్లోని సేలల్ ఖార్ద్ టౌన్ ఆసుపత్రికి డెడ్ బాడీని తరలించినట్లు అధికారులు చెప్పారు. అక్కడి నుంచి సేల్ ఖార్ద్ ఆసుపత్రికి వెళ్లగా.. ఆసుపత్రిలోని మార్చురీకి తాళం వేశారని సమాచారం. దీంతో నావల్నీ మృతదేహం ఎక్కడుందనేది పజిల్ గా మారింది.
దీంతో నావల్నీ మద్దతుదారులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. తమ లీడర్ ను ప్రెసిడెంట్ పుతినే చంపించాడని, ఎలాంటి సాక్ష్యాలు దొరకకూడదనే డెడ్ బాడీని దాచి పెడుతున్నారని మండిపడుతున్నారు. మరోవైపు, నావల్నీ మరణించారన్న విషయం తెలిసి దేశవ్యాప్తంగా ఆయన మద్దతుదారులు విచారంలో మునిగిపోయారు. వివిధ సిటీలలోని ఆయన స్మారకాల వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హైడ్రామా నెలకొంది. నావల్నీకి సంతాపం తెలపకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నావల్నీకి సంతాపం తెలిపేందుకు ప్రయత్నించిన వారిని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. శని, ఆదివారాలలో దేశవ్యాప్తంగా 230 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నావల్నీ స్మారకాలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్లు స్థానిక మీడియా కథనాలు వెలువరించాయి.