China: చైనాలో 30 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు.. కారణం అదేనా?
- భౌగోళిక ఉద్రిక్తతలు, అధిక వడ్డీరేట్ల కారణంగా పెట్టబడులు వెనక్కి తీసుకుంటున్న విదేశీ సంస్థలు
- గతేడాది 33 బిలియన్ డాలర్లు పెరిగినప్పటికీ అంతకుముందు ఏడాదితో పోలిస్తే 82 శాతం తగ్గుదల
- 1993 తర్వాత ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి
చైనాలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) మూడు దశాబ్దాల కనిష్ఠానికి పడిపోయాయి. భౌగోళికపరమైన ఉద్రిక్తతలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఆదివారం విడుదల చేసిన స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్‌చేంజ్ డేటా ప్రకారం.. చైనా తన చెల్లింపుల బ్యాలెన్స్‌లో ప్రత్యక్ష పెట్టుబడులు గతేడాది స్వల్పంగా 33 బిలియన్ డాలర్లు పెరిగాయి. అయినప్పటికీ చైనాలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కనిష్ఠానికి పడిపోవడం 1993 తర్వాత ఇదే తొలిసారి.
కొవిడ్ లాక్‌డౌన్ల ప్రభావానికి తోడు గతేడాది బలహీన రికవరీ నమోదైనట్టు డేటా పేర్కొంది. 1998 తర్వాత తొలిసారి గతేడాది మూడో త్రైమాసికంలో పెట్టుబడి పడిపోయింది. అయితే, చివరి త్రైమాసికంలో కొంత పుంజుకుని 17.5 బిలియన్ డాలర్లతో వృద్ధి సాధించినప్పటికీ అంతకుముందు ఏడాదితో పోలిస్తే మూడోవంతు తక్కువగా నమోదైంది. భౌగోళిక ఉద్రిక్తతలు, అధిక వడ్డీరేట్ల కారణంగా విదేశీ కంపెనీలు తమ పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నట్టు బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. చైనా వాణిజ్యం మంత్రిత్వశాఖ ఇటీవల వెల్లడించిన గణాంకాల్లోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గతేడాది మూడేళ్ల కనిష్ఠానికి పడిపోయినట్టు తెలిపాయి.